NTV Telugu Site icon

Ongole: రిమ్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్

Tdp Mla Arrest

Tdp Mla Arrest

ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రేపల్లెలో అత్యాచారానికి గురైన బాధితురాలిని పరామర్శించేందుకు బంధువులు రాగా.. పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తక్షణమే బాధితురాలిని చూపించాలని నిరసన చేపట్టారు. అయితే బాధితురాలి బంధువులతో కలిసి కొండేపి టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా బాధితురాలి బంధువులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి కాలికి గాయమైంది. అనంతరం పోలీసులు ఎమ్మెల్యేను ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాలికి రక్తం కారుతున్నా ఎమ్మెల్యేను పోలీసులు పీఎస్‌కు తరలించడంపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువెళ్ళమని కోరినా పోలీసులు స్పందించలేదని ఆరోపించాయి.

అనంతరం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో రేపల్లె ఘటన బాధితురాలిని మంత్రి విడదల రజినీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేపల్లె ఘటన అత్యంత బాధాకరమన్నారు. పొట్టకూటి కోసం వచ్చిన కుటుంబానికి ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం జగన్ స్పందించారని.. పూర్తి వివరాలు తీసుకుని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. బాధ్యులపై చర్యలతో పాటు బాధితురాలి ఆరోగ్యంపై కూడా సీఎం జగన్ మాట్లాడినట్లు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని.. ఇలాంటి ఘటనలను సీఎం జగన్ ఉపేక్షించరని మంత్రి విడదల రజినీ పేర్కొన్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా అందించినట్లు ఆమె వెల్లడించారు.

Repalle Case: రైల్వేస్టేషన్‌లో గ్యాంగ్ రేప్.. బాపట్ల జిల్లా ఎస్పీ ఏమన్నారంటే..?