Site icon NTV Telugu

AP Assembly: సభలో గందరగోళం.. మరోసారి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొనడం.. టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయడం నిత్యం జరుగుతోంది.. ఇక, ఇవాళ కూడా జంగారెడ్డిగూడెం మరణాల అంశంపై సభలో చర్చకు పట్టుపట్టారు ప్రతిపక్ష సభ్యులు.. స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు.. జంగారెడ్డి గూడెం మరణాలపై జుడీషియల్ విచారణకు డిమాండ్ చేశారు.. అయిలే, మార్షల్స్ సహకారంతో సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లేటట్లు చేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. కానీ, బల్లలు చేరుస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు టీడీపీ సభ్యులు.. స్పీకర్ పదే పదే అభ్యర్థించినా నినాదాలతో సహను హోరెత్తించారు.. దీంతో, ఆగ్రహించిన స్పీకర్‌.. ఇవాళ ఒక రోజు టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Read Also: Narayana Swamy: టీడీపీ బండారం బయట పెడతా..

ఇక, ఆందోళన చేస్తున్న తెలుగుదేశం సభ్యులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం… మీరు వీధి రౌడీలు కాదు.. ఇటువంటి ప్రవర్తన కరెక్ట్ కాదని హితవుపలికిన ఆయన.. సభకు, స్పీకర్ స్థానానికి గౌరవం ఇవ్వటం నేర్చుకోవాలని సూచించారు. మీరు సరిగ్గా ప్రవర్తిస్తే మీతోనే సభను నిర్వహిస్తానన్న ఆయన.. సభ్యులు సభకు వచ్చే ముందు నిబంధనలు చదువుకుని రావాలని పేర్కొన్నారు.. అనేక ప్రశ్నలు ఉన్నాయి వాటి పై మాట్లాడండి.. కానీ, ఇలాంటి ప్రవర్తన సరికాదన్నారు.. మరోవైపు.. టీడీపీ వ్యవహార శైలిపై సీరియస్‌గా దృష్టి సారించేందుకు సిద్ధమైంది అసెంబ్లీ.. సభలో సభ్యుల ప్రవర్తన, నిబంధనావళిని సమీక్షించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్.

Exit mobile version