Site icon NTV Telugu

వైసీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు: టీడీపీ నేత పట్టాభి

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత పట్టాభి మరోసారి ఆరోపణలు చేశారు. 20 రోజుల క్రితం వైసీపీ శ్రేణులు పాల్పడిన ఘటనలను ఎవరూ మరిచిపోలేరని.. తాను విదేశాలకు పారిపోయానని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని తెలిపారు. తన కుటుంబంపై దాడి జరిగిన తర్వాత తన కుటుంబంతో కలిసి తాను బయటకు వెళ్లానని.. అంత మాత్రానికే తన పని అయిపోయిందని, తన గొంతు కూడా వినిపించదంటూ పేటీఎం బ్యాచ్ తెగ సంబరపడిపోతుందని ఎద్దేవా చేశారు. నీతి, నిజాయితీతో కూడా పసుపు నాయకుడిగా తాను మాట్లాడుతున్నానని… తాను వెనకడుగు వేసే ప్రస్తక్తే లేదన్నారు.

Read Also: విశాఖలో విషాదం.. చేపల వేటకు వెళ్ళి నలుగురి మృతి

ఏ స్థాయిలో ఉన్న నేత తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా ఆధారాలతో సహా బయటపెట్టడమే తన పని అని టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యానించారు. వైసీపీ అరాచకాలను తట్టుకుని పోరాడుతున్న టీడీపీ శ్రేణులకు హ్యాట్సాఫ్ చెప్పాలిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యధిక పన్ను వసూలు చేస్తోందని ఏపీనేనని పట్టాభి ఆరోపించారు. ఈ విషయం తాను అనడం లేదని.. స్వయంగా కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రే చెప్పారని.. ఆయనకు సీఎం జగన్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌పై తమ ప్రభుత్వం ఎలాంటి పన్ను పెంచలేదని.. కేవలం రోడ్ల సెస్ కింద రూపాయి మాత్రమే తీసుకుంటున్నామంటూ సిగ్గులేకుండా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని మండిపడ్డారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి ఏపీలో రూ.28వేల కోట్ల రూపంలో పెట్రోల్, డీజిల్‌పై పన్నులు వసూలు చేశారని.. మళ్లీ దీనికి అదనంగా రోడ్ల సెస్ పేరుతో లీటరుకు రూపాయి వసూలు చేస్తున్నారని పట్టాభి విమర్శలు చేశారు. ఇప్పటివరకు తనపై వైసీపీ వాళ్లు మూడు సార్లు దాడులు చేశారని.. అయినా వైసీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

Exit mobile version