NTV Telugu Site icon

Telugu Desam Party: మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలపై టీడీపీ కసరత్తు

Telugu Desam Party

Telugu Desam Party

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీలో జోష్ తేవాలని చంద్రబాబు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఈనెల 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లాలో జరిగే మహానాడును ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మహానాడులో ముఖ్యంగా 15 తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తీర్మానాలపై ఇప్పటికే టీడీపీ అగ్రనేతలు కసరత్తులు పూర్తి చేసినట్లు సమాచారం. అయితే రాజకీయ తీర్మానాలకు సంబంధించి ఏయే అంశాలు ప్రస్తావించనున్నారనే అంశంపై అందరి దృష్టి పడింది. ఈ తీర్మానాల ద్వారా వచ్చే ఎన్నికల్లో పొత్తులు, భవిష్యత్‌ ఎన్నికల ముఖచిత్రంపై మహానాడులో స్పష్టమైన సంకేతాలను టీడీపీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వకుండా జాగ్రత్తపడతామంటూ ఇప్పటికే పవన్‌ కళ్యాణ్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన ప్రకటనకు కొంచెం అటు ఇటుగానే టీడీపీ రాజకీయ తీర్మానం చేసే అవకాశముంది. అటు బీజేపీ విషయంలో మహానాడులో టీడీపీ ఎలాంటి ప్రస్తావన చేయబోతుందో వేచి చూడాలి. రాష్ట్రానికి ఏది మంచిదైతే అదే నిర్ణయం తీసుకుంటామని, బీసీల విషయంలో మహానాడులో ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

పొత్తులనేవి ఏదో కొత్త వ్యవహరం అన్నట్టు వైసీపీ మాట్లాడుతోందని.. ఒంటరిగా పోటీ చేయాలా లేదా పొత్తు పెట్టుకోవాలా అనేది తాము అంతర్గతంగా తీసుకునే నిర్ణయమని ఆయన తెలిపారు. మహానాడులో తీర్మానాలపై పూర్తి స్థాయిలో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. వైసీపీ రాజకీయ పార్టీ కాదు.. గాలి పార్టీ అని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. తమ దగ్గర నుంచి వెళ్లిన బీసీలకే రాజ్యసభ పదవులు ఇచ్చారని.. ఏపీలో ఉన్న బీసీలు బీసీలే కాదా అని ఆయన ప్రశ్నించారు. రెండు రాజ్యసభ స్థానాలను తన పర్సనల్‌ వ్యవహారాలు చూసే వారికి జగన్‌ కేటాయించడం సిగ్గుచేటన్నారు.

Tadipatri: జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. అక్రమ నిర్మాణాలపై ఆగ్రహం

2014లో 103 మంది ఎమ్మెల్యేలను గెలిస్తే.. తొమ్మిది మంది బీసీలకు మంత్రి పదవులిచ్చామని వైసీపీ నేతలు గుర్తించాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు. 151 స్థానాలు గెలిచిన వైసీపీ కేవలం 10 మంది బీసీలకే పదవులు ఇచ్చిందని ఆరోపించారు. టీడీపీ-బీసీల మధ్య ఉన్నది కాంక్రీట్‌ బంధం అని అభివర్ణించారు. మహానాడు వేదికకు పర్మిషన్‌ ఇచ్చే విషయంలోనూ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల కోసం టీడీపీ కార్యకర్తలు బాగా ఛార్జ్‌ అయ్యారని.. గేర్‌ మార్చారని అచ్చెన్నాయుడు తెలిపారు. కార్యకర్తలకు, ప్రజలకు భాగస్వామ్యం కల్పించే విధంగా ఒంగోలులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఒంగోలు సమీపంలోని గ్రామస్థుల సహకారంతో మహానాడు వేదికను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.