Suspected Monkey Pox Case Registered In Guntur: కరోనా వైరస్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే.. దేశంలో మంకీ పాక్స్ కోరలు చాచుతోంది. నెమ్మదిగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ, కేరళలో పలు కేసులు నమోదయ్యాయి. మెల్ల మెల్లగా ఇతర రాష్ట్రాలకూ వ్యాపిస్తోన్న మంకీ పాక్స్.. తెలుగు రాష్ట్రాల్లోనూ అలజడి సృష్టిస్తోంది. రీసెంట్‌గానే ఖమ్మంలో ఓ అనుమానిత కేసు నమోదవ్వడం కలకలం రేపింది. ఇప్పుడు గుంటూరులోనూ ఓ అనుమానిత కేసు వెలుగుచూసింది.
ఒంటిపై దద్దుర్లతో ఎనిమిదేళ్ల బాలుడు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్)లో చేరాడు. రెండు వారాల క్రితమే జీజీహెచ్‌కు బాలుడ్ని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఒంటిపై దద్దుర్లు ఉండడంతో.. మంకీ పాక్స్‌గా వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శాంపిల్‌ను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి జీజీహెచ్ అధికారులు పంపించారు. రిపోర్ట్ ఆధారంగా తదుపరి కార్యచరణ ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాలుడ్ని ఓ ప్రత్యేక వార్డులో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. కాగా.. బాలుడి తల్లిదండ్రులు ఒడిశాకి చెందినవారు. ఉపాధి కోసం పల్నాడుకి వచ్చారు.
ఇదిలావుండగా.. దేశంలో మంకీ పాక్స్ కేసులు నమోదువుతున్న తరుణంలో కేంద్రం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది. మంకీపాక్స్ లక్షణాలు, చికిత్సకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేసింది. మంకీ పాక్స్ ఎక్కువగా వ్యాపించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రజలు అప్రమత్తగా ఉండాలని, ఆరోగ్య పరమైన జాగ్రతల్ని నిత్యం పాటించాలని సూచించింది.