Site icon NTV Telugu

Sunil Deodhar: జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుంది

Sunil Deodhar

Sunil Deodhar

Sunil Deodhar Gives Clarity On Alliance With Janasena Party In AP: మంగళగిరి సభలో తాను బీజేపీతో కలిసి ముందుకు సాగలేనంటూ పవన్ కళ్యాణ్ పరోక్షంగా చెప్పడం, ఆ వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబుని కలవడంతో.. బీజేపీకి జనసేన గుడ్‌బై చెప్పేసిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. అలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని ఏపీ బీజేపీ కో-కన్వీనర్ సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీ రెండూ దొంగల పార్టీలేనని విమర్శించిన ఆయన.. భవిష్యత్తులో కూడా టీడీపీతో బీజేపీకి పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. జనసేనతో రోడ్ మ్యాప్ విషయంలో ఎలాంటి గందరగోళం లేదన్నారు. విశాఖలో జరిగిన ఘటనపై పవన్ కళ్యాణ్‌తో చాలామంది బీజేపీ నేతలు మాట్లాడారని, సంఘీభావాన్ని తెలిపారని పేర్కొన్నారు.

కాగా.. బీజేపీ తనకు ఇప్పటికీ వైసీపీ పోరాటం విషయంలో రోడ్ మ్యాప్ ఇవ్వలేదని, ఇంకెంత కాలం వేచి చూడాలని మంగళగిరి సభలో పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. తనకు బీజేపీపై, అలాగే ప్రధాని నరేంద్ర మోడీపై గౌరవం ఉన్నా.. వారికి ఊడిగం మాత్రం చేయబోనని పవన్ తేల్చి చెప్పారు. బీజేపీతో పొత్తు కుదిరినప్పటికీ.. తాను బలంగా పని చేయలేకపోయానని అన్నారు. తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై పోరాడడానికి బీజేపీ ముందుకు రాకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. బీజేపీ తీరు కారణంగానే తాను వ్యూహాలు మార్చుకోవాల్సి వచ్చిందని.. ఇకపై ఏపీలో కొత్త రాజకీయ ముఖ చిత్రం చూస్తారని పవన్ ఆయన చెప్పారు. ఆ మాట చెప్పిన కొన్ని గంటల్లోనే చంద్రబాబుని కలవడంతో.. బీజేపీతో తెగదెంపులు చేసుకొని, టీడీపీతో పవన్ మరోసారి జత కట్టబోతున్నారన్న ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఉలిక్కి పడ్డ బీజేపీ.. జనసేనతో పొత్తు సాగుతుందని స్పష్టం చేసింది.

Exit mobile version