Site icon NTV Telugu

Andhra Pradesh: మొబైల్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చదివే పాలిటెక్నిక్ కాలేజీలో అందరికీ ఫోన్‌ ఉండటం, తనకు ఒక్కడికే లేకపోవడంతో మనస్తాపం చెంది యువకుడు ఈ అఘాయిత్యం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… రాయవరం మండలం పసపూడికి చెందిన ఒకరు వ్యవసాయ కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పాలిటెక్నిక్ సెకండియర్ చదువుతున్న ఆయన కుమారుడు సెలవు రోజున ఇంటికి వచ్చాడు. తనకు స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వమని తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. తమకు అంతస్థాయి లేదని తల్లిదండ్రులు స్పష్టం చేశారు.

దీంతో తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో యువకుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన తల్లి గమనించి వెంటనే యువకుడిని రామచంద్రాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆస్పత్రి సిబ్బంది, మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మొబైల్‌ ఫోన్‌ కోసం కుమారుడు ప్రాణాలు తీసుకోవడం పట్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version