Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా చిట్‌ఫండ్స్ సంస్థల కార్యాలయాలపై ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ దాడులు చేస్తోంది. విజయవాడలోని నాలుగు మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాలతో పాటు రాష్ట్రంలోని పలు ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. మార్గదర్శితో పాటు శ్రీరామ్ చిట్స్, కపిల్ చిట్స్ ఫండ్స్ కార్యాలయాల్లోనూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చిట్స్ పేరుతో సేకరిస్తున్న సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా పలు చిట్‌ఫండ్ సంస్థలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించుకుంటున్నారని.. ఈ సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. చిట్స్ పూర్తయిన తర్వాత పలు సంస్థలు అధిక వడ్డీ ఆశ చూపి తమ వద్దే డిపాజిట్ చేయించుకుటున్నాయన్న ఆరోపణలపై తాజా సోదాల్లో లెక్కలు బయటపడే అవకాశం ఉంది.
Read Also: YS Jagan: రేపు హైదరాబాద్‌కు వైఎస్ జగన్.. సూపర్‌స్టార్ కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం..
అటు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ చేపట్టిన డిపాజిట్ల అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణలతో గతంలో కాంగ్రెస్ పార్టీ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే 2018, డిసెంబర్ 31న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ కేసులో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని పిటిషన్ దాఖలు చేసింది.