బ్రహ్మోత్సవాల కోసం పుష్కరిణి మరమ్మతు పనులును చేపట్టింది టీటీడీ. శ్రీవారి ఆలయంలో పుష్కరిణి హరతిని నెల రోజులు పాటు రద్దు చేసింది. ఇప్పటికే పనులు ప్రారంభించింది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే తిరిగి సెప్టెంబర్ 13నుంచే పుష్కరిణిని భక్తులకు అందుబాటులోకి తెస్తారు.. శ్రీవారి ఆలయానికి ఈశాన్యం మూలలో స్వామివారి పుష్కరిణి నెలకొని వుంటుంది. ముల్లోకాలలో వున్న అన్ని తీర్దాలు స్వామి పుష్కరిణిలో కలుస్తాయని ఆలయ పండితులు పేర్కొంటారు. దీంతో శ్రీవారి పుష్కరిణిని దర్శించుకున్నా.. అందులో స్నానం చేసిన సమస్త పాపాలు హరించుకుపోతాయని భక్తులు విశ్వాసం. అసలు తిరుమల చేరుకున్న భక్తులు క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించి.. వరాహస్వామిని దర్శించుకొని… ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకుంటే.. అంతా మంచి జరుగుతుంది అంటారు పండితులు.
ఇక స్వామివారి పుష్కరిణిలో ప్రతి ఏటా పాల్గుణ మాసం పౌర్ణమికి ముగిసేలా ఐదు రోజులు పాటు తెపోత్సవాలు నిర్వహిస్తారు. వైకుంఠ ద్వాదసి, రథ సప్తమి రోజున బ్రహ్మోత్సవాలలో చివరి రోజు పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం జరుపుతారు. అంతటి పరమ పవిత్రమైన శ్రీవారి పుష్కరిణిలో నిత్యం వేల సంఖ్యలో భక్తులు స్నానాది కార్యక్రమాలు ఆచరిస్తారు. నిత్యం స్వామివారి సహస్రదీపాలంకరణ సేవ ముగిసిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారు నాలుగు మాఢ వీధులలో విహరిస్తూ భక్తులుకు దర్శనమిస్తారు.
అదే సమయంలో ఉరేగింపులో భాగంగా స్వామివారు తూర్పు మాడ వీధిలో వున్న పుష్కరిణికి చేరుకున్న సమయంలో అర్చకులు పుష్కరిణి హరతిని ఇస్తారు. ఇలా నిత్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగే స్వామివారి పుష్కరిణి హరతికి ప్రతి ఏటా నెల రోజులు పాటు మాత్రం బ్రేకు పడుతుంది. బ్రహ్మోత్సవాలు ముందు శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులు నిర్వహించడం పరిపాటిగా మారిపోయింది. ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 7 నుండి 15 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపింది టీటీడీ. దీనికి ముందు నెల రోజులు పాటు పుష్కరిణి మరమత్తుల పనులుకు శ్రీకారం చుట్టింది. అన్ని అనుకున్నట్టుగా సాగితే తిరిగి సెప్టెంబర్ 13నుంచే పుష్కరణి హారతిని పునరుద్దరించనుంది టీటీడీ.