NTV Telugu Site icon

Srinivas Goud: మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు

Alluri1

Alluri1

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ జ్యోతి, చైతన్య దీప్తి అల్లూరి సీతారామరాజు 98వ వర్థంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుడు, విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 98వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉమ్మడి రాష్ట్రాల క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని అల్లూరికి ఘన నివాళులర్పించారు.

ఆనాటి స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినా పోరాటాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు జాతికి, తెలంగాణ ప్రాంతానికి చెందిన మహనీయుల సేవలను నేటి తరానికి అందించేందుకు వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించి వారి సేవలను గుర్తుచేస్తున్నామన్నారు.

27 ఏళ్ళ వయస్సులో గిరిజనులు, నిరక్షరాస్యులను, పేదలను, కొద్దిమంది అనుచరులతో, పరిమిత వనరులతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన గొప్ప ఉద్యమ శక్తి అల్లూరి సీతారామరాజు అని అభివర్ణించారు. అల్లూరి సీతారామరాజు ఈతరానికి కూడా స్ఫూర్తి అన్నారు. ఆయన త్యాగదీక్ష, ఏకాగ్రత, ధైర్యం నేటి యువత అలవర్చుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు చరిత్రను, వారి త్యాగనిరతిని భవిష్యత్ తరాలకు అందించేలా అందరూ కృషి చేయాలని ఆయ‌న‌ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రమేష్ దాట్ల, మంతెన వెంకట రామరాజు, DSN రాజు, అల్లూరి సీతారామరాజు, VVR వర్మ, క్షత్రీయ సేవ సమితి అధ్యక్షుడు పెరిచెర్ల నాగరాజు, నడింపల్లి నానిరాజు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదాపూర్ సమీపంలోని ఖానామెట్ గ్రామ పరిధిలో 2 ఎకరాల 36 గుంటల భూమి పత్రాలను AP & TS Kshatriya Seva Samithi కి ప్రభుత్వం కేటాయించిన పత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో జంటనగరాల్లో క్షత్రియ సోదరులు, సోదరీమణులు పాల్గొన్నారు.

Madhya Pradesh: వెంటపడి మరీ మహిళను చితకబాదిన లాయర్.. కారణమేంటంటే?

Show comments