Nandamuri Balakrishna: ఆంధ్రప్రదేశ్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు ఇప్పటికే ముగిసిపోగా.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నికలు నిర్వహించారు.. కొన్ని చోట్ల అనుకోని పరిస్థితిలు నెలకొనగా.. చాలా చోట్ల ప్రశాంతంగా ఎన్నికలు ముగిసాయి.. ఇక, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురం పట్టణం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని, కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరిపై ఎంతో బాధ్యత ఉందని అన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
పార్టీ భేదాలు లేకుండా అభివృద్ధికి కృషి చేయాలి
ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో తమను ఎన్నుకున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని, భవిష్యత్తుపై వారు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా కౌన్సిల్ సభ్యులందరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ఎలాంటి తారతమ్యాలు, పార్టీ భేదాలు లేకుండా అన్ని వార్డుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు బాలయ్య…
హిందూపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి
హిందూపురం పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ప్రజలకు అవసరమైన పనులు చేపడుతూ, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అభివృద్ధి ఫలాలు అన్ని వార్డుల ప్రజలకు అందేలా చూడాలని తెలిపారు. హిందూపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కౌన్సిల్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని సార్థకం చేస్తూ పట్టణాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు హిదూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..

