NTV Telugu Site icon

YS Jagan: నెల్లూరు జిల్లాపై వైసీపీ హైకమాండ్‌ ఫోకస్‌.. పార్టీకి పూర్వ వైభవం..!

Ys Jagan

Ys Jagan

YS Jagan: నెల్లూరు జిల్లాలో వైసీపీ పూర్వ వైభవంపై పార్టీ హైకమాండ్‌ ఫోకస్‌ పెట్టింది. అధికార పక్షాన్ని ఢీకొట్టే బలమైన నేతలను సిద్ధం చేయడంపై దృష్టిసారించింది. అదే సమయంలో పార్టీలో వర్గపోరు, ఆధిపత్య పోరు కుమ్ములాటలకు చెక్‌ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత నెల్లూరు జిల్లా ప్రజలు అండగా నిలిచారు. 2014..2019 సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాన్ని కట్టబెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జిల్లాలో ఫ్యాన్‌ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత.. పలువురు నేతలు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సొంత వ్యాపార కార్యకలాపాల్లో బిజీ అయిపోయారు. దీంతో నియోజకవర్గస్థాయి నేతల మధ్య సమన్వయం కొరవడింది.

Read Also: Priya Prakash Varrier : మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఎక్కడ..?

కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా.. వైసీపీ అధిష్టానం నిరసన కార్యక్రమాలను పిలుపునిస్తోంది. ఈ కార్యక్రమాల్లో జిల్లా నేతలు మొక్కుబడిగా పాల్గొనడం అధిష్టానం దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. లీడర్ల మధ్య సమన్వయం లోపంతో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంలేదని సమాచారం. విద్యుత్ ఛార్జీలతో పాటు పలు సమస్యలపై ఆందోళనకు పిలుపునిచ్చినా.. క్యాడర్‌లో ఆశించిన స్థాయిలో స్పందన కరువైందన్న చర్చసాగింది. నియోజకవర్గస్థాయిలో పార్టీ పరిస్థితులపై నివేదిక సేకరించిన జగన్.. స్వయంగా నేతలతో మాట్లాడేందుకు తాడేపల్లిలో సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ సూచించారు. పార్టీ కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తానని.. హామీ ఇచ్చారు. తాను కూడా స్వయంగా జిల్లాకు వచ్చి నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశమవుతానని ప్రకటించారు. నేతల మధ్య ఏమైనా విభేదాలు ఉన్నా.. వాటిని మర్చిపోయి సమన్వయంతో పని చేయాలన్నారు. మొత్తంగా అధినేత జగన్ సమావేశం తర్వాత జిల్లా వైసిపి శ్రేణుల్లో ఎలాంటి మార్పు వస్తుందో వేచిచూడాలి.

Show comments