NTV Telugu Site icon

Rottela Panduga: నేటి నుంచి నెల్లూరులో రొట్టెల పండుగ.. విస్తృత ఏర్పాట్లు..

Rottela Panduga

Rottela Panduga

Rottela Panduga: నెల్లూరు నగరంలో ప్రతి ఏటా మొహరం సందర్భంగా జరిగే రొట్టెల పండుగ కోసం జిల్లా అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి నాలుగు ఐదు రోజులపాటు జరిగే ఈ పండుగ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి రానున్నారు. దర్గా మిట్టలోని స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. దర్గా ప్రాంగణంలోని బారా షాహిద్ లను దర్శనం చేసుకొని.. అనంతరం స్వర్ణాల చెరువులో తమ కోరికకు సంబంధించిన రొట్టెను పట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులు ఏదైనా కోరికను కోరుకొని ఆ రొట్టెను వదిలే వారి నుంచి తీసుకుంటారు. గత ఏడాది తాము అనుకున్న కోరికకు సంబంధించిన రొట్టెను పట్టుకుని.. అది నెరవేరితే తర్వాత మరుసటి ఏడాది వచ్చి ఆ రొట్టెను వదలడం సంప్రదాయంగా వస్తోంది.

Read Also: Chandrababu Meets Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు సుదీర్ఘ భేటీ.. కీలక అంశాలపై చర్చ

ప్రధానంగా సంతాన రొట్టె.. ఆరోగ్య రొట్టె.. చదువు రొట్టె.. వివాహ రొట్టె.. విదేశీ రొట్టె.. ఉద్యోగ రొట్టె.. ఇలా 12 రకాల కోరికలకు సంబంధించిన రొట్టెలను ఇక్కడ ఇచ్చిపుచ్చుకుంటారు. గతంలో మొహరం రోజున మాత్రమే ఈ రొట్టెల పండుగను నిర్వహించేవారు.. భక్తుల రద్దీ అధికం కావడంతో రొట్టెల పండుగను ఐదు రోజులపాటు నిర్వహిస్తున్నారు. భక్తుల కోసం నెల్లూరు నగరపాలక సంస్థ.. పోలీసు శాఖతోపాటు ఇతర విభాగాల సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లను చేశారు. చెరువులో రొట్టెలు మార్చుకునేందుకు వీలుగా సూచిక బోర్డులు.. భక్తులు ఉండేందుకు గుడారాలు.. స్నానపు గదులు.. మహిళల కోసం ప్రత్యేకంగా దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేశారు. దర్గా ప్రాంగణంలో పారిశుద్ధ నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వేల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు.. సీసీ కెమెరాలతో భక్తుల కదిలికలను పర్యవేక్షించడంతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు.. అంబులెన్స్ లను అందుబాటులో ఉంచారు.

Read Also: Tummala Nageswara Rao : ఈనెల 18న రైతులకు రుణమాఫీ చేస్తున్నాం

మరోవైపు.. నెల్లూరు చెరువులో బోటింగ్ కోసం పర్యాటక శాఖ ప్రత్యేక బోట్లను సిద్ధం చేసింది. ముందు జాగ్రత్తగా గజ ఈత గాళ్లను కూడా అధికారులు సిద్ధంగా ఉంచారు. పండుగలో భాగంగా మొదటి రోజున సందల్ మాలీ.. రెండో రోజున గంధ మహోత్సవం నిర్వహిస్తారు. బారా షాహిద్ లకు గంధాన్ని లేపనం చేసిన తర్వాత ఆ గంధాన్ని భక్తులకు పంచి పెడతారు. మూడవ రోజున రొట్టెల పండుగ.. నాలుగో రోజు తహలీల్ ఫాతెహ.. ఐదో రోజున ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రొట్టెల పండుగ సందర్భంగా భక్తులు.. ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.