Site icon NTV Telugu

Somu Veerraju: ఏపీలో మరో అతిపెద్ద ఇండస్ట్రీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ప్రధానికి సోము వీర్రాజు కృతజ్ఞతలు

Somu Veerraju

Somu Veerraju

Somu Veerraju: ఏపీలోని కాకినాడ జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొండంగి మండలం కేపీ పురం, కోదాడ గ్రామాల పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను 90 రోజుల్లోగా ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ ఐఎఫ్‌సీఐ (ఇండస్ట్రియల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)కు పంపాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ఏపీకి బల్క్ డ్రగ్ పార్క్‌ను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింద‌ని సోము వీర్రాజు త‌న ట్వీట్‌లో తెలిపారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఓ లేఖ రాసింద‌ని వెల్లడించారు. ఏపీకి బ‌ల్క్ డ్రగ్ పార్క్‌ను కేటాయించిన ప్రధాని న‌రేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డాల‌కు రాష్ట్ర ప్రజ‌ల త‌ర‌ఫున ధ‌న్యవాదాలు తెలియ‌జేస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా బల్క్‌ డ్రగ్‌ పార్కుల ఏర్పాటును ప్రోత్సహించేందుకు 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద దేశంలో మూడు ప్రాంతాల్లో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లను ఏర్పాటు చేస్తామని, అందుకోసం ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా రూ.6,940 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. రానున్న 8 ఏళ్లలో ఈ పార్క్‌ ద్వారా రూ.46,400 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ సంస్థ ద్వారా 10 వేల నుంచి 12 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ డీపీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత ఏపీ ప్రభుత్వం వేగంగా మౌలిక సదుపాయాలను కల్పించే అవకాశాలున్నాయి.

Exit mobile version