Site icon NTV Telugu

Somu veerraju: అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉంది

మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ మరోసారి ప్రకటన చేయడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేయగా తాజాగా బీజేపీ కూడా జగన్ ప్రకటనను తప్పుబట్టింది. ఎన్నికల ముందు ఇచ్చిన మాటపై సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా మడం తిప్పారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. అమరావతి రాజధానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్, న్యాయ స్థానాలవంటి పదాలు అసెంబ్లీలో వినియోగించి వికేంద్రీకరణ పాట పాడడం దారుణమన్నారు.

కర్నూలులో హైకోర్టు ఉండాలని బీజేపీ కోరుకుందని.. అంటే దానర్ధం రాజధాని అని కాదు అని సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ప్రధాని నరేంద్ర మోదీ చేసి చూపించారని ఆయన పేర్కొన్నారు. అమరావతి రాజధాని కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగిందని.. ఈ వాస్తవాన్ని సీఎం జగన్ గ్రహించాలని హితవు పలికారు. కేంద్రప్రభుత్వం చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయగలమని.. వైసీపీ ప్రభుత్వం అయితే శ్వేతపత్రం బదులు బ్లాక్ పేపర్ విడుదల చేస్తుందని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.

అటు సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కూడా స్పందించారు. రాజకీయ దురుద్దేశంతో జగన్ ప్రభుత్వం మళ్లీ తీసుకొచ్చే మూడు రాజధానుల ప్రతిపాదన న్యాయ సమీక్షకు నిలవదని సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఏపీకి కావాల్సింది రాజధానుల వికేంద్రీకరణ కాదని.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆయన సూచించారు. ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలన్నదే త‌న అభిమ‌త‌మ‌న్నారు. ఒకే రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

https://ntvtelugu.com/botsa-satyanarayana-counter-to-chandrababu-on-ap-capital-issue/
Exit mobile version