Site icon NTV Telugu

Somu Veerraju: పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ టూర్‌.. సోమువీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

Somu Veerraju

Somu Veerraju

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఢిల్లీలో పర్యటించిన విషయం విదితమే.. బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డాతో పాటు మరికొందరు నేతలను కలిశారు.. అయితే, బీజేపీ-జనసేన పొత్తు వ్యవహారంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ చీఫ్‌ సోమువీర్రాజు.. బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు.. దేశానికి జగ్జీవన్ రాం ఎన్నో సేవలందించారని గుర్తుచేసిన ఆయన.. ఉప ప్రధానిగా దేశానికి సేవలందించారు.. దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు జగ్జీవన్ రాం ఆహార మంత్రిగా చేశారు.. 1977లో జగ్జీవన్ రామ్‌ను దేశ ప్రధానిని చేయాలని ఆనాటి జనతా పార్టీ ప్రయత్నించిందని తెలిపారు.

Read Also: Today Business Headlines 05-04-23: ముగ్గురూ.. ముగ్గురే. ఒక్కొక్కరికి 30 బ్రాండ్లు. మరిన్ని వార్తలు

ఇక, జనసేన, బీజేపీ పొత్తులపై సోము వీర్రాజు మాట్లాడుతూ.. జనసేన-బీజేపీ కలిసి ముందుకెళ్తాయి.. కలిసే ఉన్నాం అని స్పష్టం చేశారు.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేన-బీజేపీ కలిసి పోరాడతాయన్న ఆయన.. చంద్రబాబుతో పవన్‌ కల్యాణే కాదు.. నేను కూడా వివిధ సందర్భాల్లో చంద్రబాబుతో భేటీ అయ్యాను అన్నారు. రాజకీయాల్లో వివిధ పార్టీల నేతలు కలవడమనేది సర్వ సాధారణమైన విషయం.. ఎవ్వరూ కంగారు పడాల్సిన పనిలేదన్నారు.. మరోవైపు.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. ఆలయాలపై దాడులు పెద్ద ఎత్తున జరిగాయి. ఏపీలో హైంధవ ధర్మం అపహస్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఫిరంగిపురంలో వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదని మండిపడ్డారు. హిందూమతంపై దాడులు జరుగుతోంటే ఒక్క అరెస్టైనా జరిగిందా..? ఏపీలో ఎంతో మందిని అరెస్ట్ చేస్తున్నారు.. కానీ, దేవాలయాలపై దాడులు చేస్తున్న వారిలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం తీరు మారకుంటే.. కపిల తీర్థం నుంచి రామ తీర్థం వరకు యాత్ర చేపడతామని ప్రకటించారు వీర్రాజు.

మరోవైపు.. తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ అరెస్ట్ దారుణం అన్నారు సోము వీర్రాజు.. పరీక్ష లీకేజీ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్న ఆయన.. పేపర్ లీకేజీ మీద బండి సంజయ్ కు ఎలాంటి సంబంధం ఉంటుంది..? అని ప్రశ్నించారు. అవినీతి సంపదతో దేశ రాజకీయాలు నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆప్, బీఆర్ఎస్ పార్టీలు తెర మరుగు కావడం ఖాయం అని జోస్యం చెప్పారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కాగా, వైసీపీ ముక్త్ ఆంధ్రప్రదేశ్ అన్నది తమ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రకటించిన విషయం విదితమే.. ఆ దిశగానే తమ అడుగులు ఉంటాయని అన్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్.. అనేక అంశాలపై లోతుగా చర్చించామని అన్నారు. అధికారం సాధించేందుకు ఏం చేయాలో చర్చించామని చెప్పారు. తన ఢిల్లీ టూర్ సత్ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. వైసీపీని ఓడించడమే బీజేపీ, జనసేన లక్ష్యమని వ్యాఖ్యానించారు పవన్‌ కల్యాణ్‌.

Exit mobile version