Somu Veerraju Fires On YCP Govt Over Sand Issue: ఏపీలో ఇసుక కంటే బంగారమే ఈజీగా దొరుకుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారం షాపుకెళ్తే బంగారం లభిస్తుందని.. కానీ ఏపీలో కళ్ల ముందున్న ఇసుక మాత్రం ప్రజలకు అందుబాటులోకి రావడం లేదని అన్నారు. గత ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం పేరుతో దొపిడీ చేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో రెండు యూనిట్ల ఇసుక రూ. 5 వేలకు దొరికితే.. ఇప్పుడు రూ. 13 వేలు ఉంటోందన్నారు. భవన నిర్మాణాలపై ఆధారపడ్డ కార్మికులు నానా తిప్పలు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన టిడ్కో ఇళ్లను ఇప్పటిదాకా ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మించాల్సిన ఇళ్లను ఎందుకు నిర్మించడం లేదని నిలదీశారు.
ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం తన వాటాను ఇవ్వడానికి సిద్దంగా ఉందని.. కానీ జగన్ ప్రభుత్వమే తన వాటా ఇవ్వడం లేదని సోము వీర్రాజు కుండబద్దలు కొట్టారు. బొప్పాయి పళ్లను అమ్మేవాళ్లు పేటీఎంలు పెడుతున్న ఈరోజుల్లో.. మద్యం దుకాణాల్లో ఎందుకు డిజిటల్ పేమెంట్లను అంగీకరించడం లేదని నిలదీశారు. ఈ ప్రభుత్వం ప్రాజెక్టుల గేట్లకు గ్రీజ్ పెట్టే పరిస్థితి లేదని.. ఎప్పుడు చూసినా పోలవరం పోలవరం అంటూ జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలవరానికి రూ. 55 వేల కోట్లు ఇస్తే.. ఆ డబ్బు మొత్తం తినేయొచ్చనే ఆశ ఇక్కడి నేతల్లో కన్పిస్తోందని ఆరోపణలు చేశారు. ఏపీలో ఫ్యామిలీ పార్టీలకు అధికారం అంటే రూలింగ్ కాదు.. ట్రేడింగ్ అని మండిపడ్డారు. రోడ్ల నిర్మాణం కోసం వివిధ మార్గాల ద్వారా రాష్ట్రానికి పెద్దఎత్తున నిధులిచ్చామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 250 కోట్లు కూడా కేటాయించడం లేదని విమర్శించారు. ఏపీలో అవినీతి, వారసత్వ పార్టీలకు వ్యతిరేకంగా ఈ నెల 18వ తేదీన ప్రచారం చేపడుతున్నామని, ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రచార రథం సిద్ధం చేస్తున్నామని, ఐదు వేల సభలు నిర్వహించాలనే దిశగా కసరత్తు చేస్తున్నామని సోము వీర్రాజు చెప్పారు.
