Site icon NTV Telugu

Somu Veerraju: చాగంటి కోటేశ్వరరావు ఎలాంటి అవార్డుకైనా అర్హులే

Somu Veerraju

Somu Veerraju

Somu Veerraju: ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ప్రకటించడంపై కవులు, కళాకారులు, సాహితీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చాగంటిని గురజాడ అవార్డుకు ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ విజయనగరంలో ర్యాలీ కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఏలూరులోని బీసీ చైతన్యసభలో ఆయన ప్రసంగిస్తూ.. తన దృష్టిలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఏ అవార్డుకైనా అర్హులేనని తెలిపారు. గురజాడ అవార్డు ఎవరికి ఇవ్వాలనే విషయం ఆ అవార్డు అందించే వ్యక్తులు, సంస్థల అభిప్రాయంపై ఆధారపడి ఉంటుందని అని సోము వీర్రాజు స్పష్టం చేశారు. చాగంటి అద్భుతమైన జ్ఞాన భాండాగారం అని సోము వీర్రాజు కీర్తించారు. రోడ్లపై ధర్నాలు చేస్తూ చాగంటి గారి పేరు ఉచ్చరించే అర్హత ఎవరికీ లేదని సోము వీర్రాజు విమర్శించారు. అవార్డుల పేరుతో ఆయన కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

మరోవైపు కుటుంబ రాజకీయాలకు బీసీలు ఎంత కాలం బలి కావాలని సోము వీర్రాజు ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రూ.10వేల కోట్ల కాంటాక్టులు బీసీ కార్పొరేషన్‌లకు అందిస్తామన్నారు. 3వేల కోట్లతో మొక్కలు పెంచే కార్యక్రమం బీసీ కార్పోరేషన్‌ల ద్వారా చేపడతామన్నారు. వీవర్స్ కార్పోరేషన్ ద్వారా స్కూల్ యూనిఫాంలు అందించే కార్పొరేషన్‌ల ద్వారా అందిస్తామని సోము వీర్రాజు తెలిపారు.

Read Also: Kishan Reddy: భిన్నకళలు, సంస్కృతిని కాపాడుకుందాం

అటు చాగంటికి గురజాడ పురస్కారం ప్రకటించడంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా స్పందించారు. గురజాడ గారి పురస్కారం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు ఇవ్వడం సముచితం అని జీవీఎల్ ట్వీట్ చేశారు. గురజాడ అభ్యుదయ భావాలు ఆ సమయంలో ఎంత ముఖ్యమో.. చాగంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు ఈ సమయంలో ప్రజలకు అంతే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ప్రపంచం మెచ్చుకునే మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని తక్కువ చేసి మాట్లాడే హేతువాదులు సిగ్గుపడాలని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version