NTV Telugu Site icon

Somu Veerraju: అంకెల గారడీతో మాయ చేశారు.. అప్పులను ఆదాయంగా చూపారు..!

Somu Veerraju

Somu Veerraju

Somu Veerraju: అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ 2023-24పై విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు.. అప్పులను ఆదాయంగా చూపించ కూడదని ఆర్బీఐ చేసిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకోకుండా అసెంభ్లీసాక్షిగా ఆర్ధిక మంత్రి బుగ్గన అంకెల గారిడీతో మాయ చేశారు. ఆయన అందుకు విదేశీ ప్రముఖల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బడ్జెట్ కు తనవాదనలను సమర్ధించుకుంటూ రాష్ట్రప్రజలకు అవాస్తవాలను శాసన సభలో వెల్లడించారని తప్పుపట్టారు. కేంద్ర నిధులు, పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్పతనంగా శాసన సభలో ఎలా చెబుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకునే రుణాలు ఎంత అనేది వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కనీసం కాగ్ కు కూడా నివేదిస్తున్నారో లేదో తెలియని గందరగోళం ప్రభుత్వంలో కొట్టచ్చినట్లు కనపడుతోంది. విభజన ఆంధ్రప్రదేశ్‌కు అంటే 2014 నుండి రాష్ట్రానికి 9 లక్షల3 వేల 336 కొట్లు అప్పులు ఉన్న పరిస్ధితి.
కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులను ఈ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకున్న విధంగా ఇది ఒక స్టిక్కర్ బడ్జెట్ గా అభివర్ణించారు సోమువీర్రాజు.

Read Also: Rana Naidu: బూతులు ఉన్నాయంటారు.. అయినా ట్రెండింగ్ లో ఉంచేస్తారు

రాష్ట్ర బడ్జెట్ 80 శాతం రెవిన్యూ వ్యయం కాగా మూలధనం వ్యయం పెరగక పోవడం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొన్నారు సోము వీర్రాజు.. మూలధనం వ్యయం లేక పోతే ఆర్ధిక కార్యకలాపాలు జరగక దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలు కుంటుపడతాయి. ద్రవ్యలోటు పెరిగిపోవడంతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతినెల సుమారుగా 21 వేల కోట్లు రాష్ట్రానికి అవసరం ఉండగా సుమారు 10 వేల కోట్లు ఆదాయంగా వస్తున్నా ప్రతి నెల నాలుగువేల కోట్లు అప్పులు చేస్తున్నట్లు చెబుతున్నారు.. మిగిలిన ఏడు వేల కోట్లు ఏవిధంగా సమకూరుతున్నాయన్న విషయం ప్రభుత్వం వెల్లడించడం లేదు. కాబట్టి ప్రభుత్వ ఆర్ధిక తీరుతెన్నుల పై మిలియన్ డాలర్ల అనుమానం కలుగుతోంది. కార్పోరేషన్ల పై తీసుకున్నరుణాలకు సంబంధించిన విషయాలను ఆర్ధిక మంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్లు రిజిస్ట్రేషన్ కంపెనీ రిజిస్ట్రార్ వద్ద రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కాబట్టి కార్పోరేషన్ లావాదేవీలు కంపెనీ రిజిస్ట్రార్ కు నివేదిస్తున్నారా? లేదా? అని ఘాటుగా ప్రశ్నించారు సోము వీర్రాజు.

మూలధన వ్యయం విషయం బుగ్గన క్లారిటీ ఇవ్వక పోగా.. ప్రభుత్వం తీసుకున్న అప్పుల వివరాలు కూడా బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో కూడా వెల్లడించక పోతే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టి ప్రజలకు ఏం చెప్పదల్చారని ప్రశ్నించారు సోమువీర్రాజు.. వ్యవసాయానికి కేంద్రం ఇస్తున్న సహకారంతో పోలిస్తే రాష్ట్రం ఇస్తున్నది లేశ మాత్రమే. వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ సేధ్యం, భూసార పరీక్షలు బడ్జె కేటాయింపులు అంకెల్లో ఘనంగా ఉన్నా క్షేత్రస్ధాయిలో రైతులకు నిరాశ ఎదురు అవుతోంది. మద్య, చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు ఒక అంకెలగారడీగానే కనపడుతోంది. ఉత్తరాంద్ర, రాయలసీమల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు నేటికీ సమస్యల సుడిగుండంలోనే ఉండడమే ఇందుతార్కాణం. అదేవిధంగా విద్యారంగానికి సంబంధించిన విషయంలో కేంద్రం ఇస్తున్న సహకారం మాత్రమే కనపడుతోంది.. అయితే, బడ్జెట్ లో రాష్ట్రం చేస్తున్నట్లుగా ఎలా చూపించుకుంటారని ప్రశ్నించారు. ఇళ్లు నిర్మాణానికి సంబంధించి ఆర్ధిక మంత్రి అంతా రాష్ట్రం చేస్తున్నట్లు చెప్పుకోవడం చూస్తే జాలి వేస్తోంది. కేంద్రం ఇచ్చిన ఇళ్లు సకాలంలో నిర్మాణం చేయకుండా అబద్దాలతో ఇళ్లు కడుతోందని రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.

Show comments