Site icon NTV Telugu

Andhra pradesh: సాఫ్ట్‌వేర్ మాయ.. కులం ఏదైనా ST సర్టిఫికెట్ జారీ

ఏపీలోని గ్రామ సచివాలయాల్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఈ మేరకు సాఫ్ట్‌వేర్ లీలలు బయటపడుతున్నాయి. కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేస్తే ఏ సామాజిక వర్గం వారికైనా ఎస్టీ సర్టిఫికెట్ జారీ అవుతోంది. దీంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన షేక్ షబ్బీర్ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ కోసం స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి ఆయన దరఖాస్తుకు ఆమోదం తెలిపారు.

అయితే సదరు వ్యక్తి షేక్ సామాజిక వర్గానికి చెందిన వాడు అని పేర్కొంటూనే ఎస్టీ సర్టిఫికెట్ జారీ కావడంతో అతడు ఆశ్చర్యపోయాడు. అదే ప్రాంతానికి చెందిన ఎన్.ప్రతిమ అనే మహిళ కూడా మాల సామాజికవర్గంగా దరఖాస్తులో పేర్కొన్నప్పటికీ.. ఆమెకు ఎస్టీ సర్టిఫికెట్ జారీ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ విషయాన్ని వారు వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో గత రెండురోజులుగా కులధ్రువీకరణ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవుతోందని.. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కులధ్రువీకరణ సర్టిఫికెట్లు జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు.

Exit mobile version