దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య 20 వేల లోపునకు పడిపోయింది. కొత్తగా 19,968 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 673 మంది మరణించారు. 48,847 మంది కోలుకున్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో నిబంధనలు పాటించడంలేదు. దీనిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వ్యాక్సినేషన్, పరీక్షలు కొనసాగించాలని సభ్యదేశాలను కోరింది.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగిన ఆయనపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీచేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మంగళహాట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. EC ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు సిటీ పోలీసులు.
మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులకు సరఫరా చేస్తున్న పేలుడు పదార్థలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నలుగురిని అరెస్ట్ చేశారు. నలుగురు వ్యక్తుల నుండి 10 కార్డెక్స్ వైర్ బండిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఇద్దరిని కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.
హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో సినీ ఇండస్ట్రీ ప్రతినిధుల కీలక సమావేశం జరుగుతోంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో జి.ఆదిశేషగిరిరావు అధ్యక్షతన భేటీ అయ్యారు. 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు. ఎస్ ఎస్ రాజమౌళి. మైత్రి నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి, ఛత్రపతి ప్రసాద్, అనిల్ సుంకర, ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. గంటన్నరపాటు సమావేశం కొనసాగింది.
ఏపీ పోలీసులని చూస్తే జాలితో కూడిన అసహ్యమేస్తోందన్నారు టీడీపీ నేత నారా లోకేష్. తమపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నా, వారి అరాచకాలకి కొమ్ముకాస్తూనే వున్నారు ఖాకీలు. ప్రభుత్వ తొత్తులుగా మారి ప్రశ్నించే ప్రజలు-ప్రతిపక్ష టిడిపి పై దాడులకీ తెగబడ్డారు. ఇన్ని చేసినా కొంతమంది పోలీసులూ చివరికి వైసీపీ బాధితులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు లోకేష్.