NTV Telugu Site icon

Srisailam: శ్రీశైలంలో నేటితో ముగియనున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Srisailam

Srisailam

Srisailam: శ్రీశైలంలో ఇవాళ్టితో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.. సాయంత్రం అశ్వవాహనంపై పూజలు అందుకోనున్నారు ఆదిదంపతులు.. ఆలయంలో శ్రీస్వామి, అమ్మవారికి ఆలయ ఉత్సవం నిర్వహించనున్నారు.. రాత్రి పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలకనున్నారు.. ఏడు రోజుల పంచాహ్నిక దీక్షతో నిత్యం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అలంకారాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవరోజు అనగా మంగళవారం ఉదయం శ్రీచండీశ్వరస్వామికి షోడశోపచార క్రతువులు చేశారు. అటుపై దేవ‌స్థానం ఈవో లవన్న ఆధ్వర్యంలో రుద్రహోమ పూర్ణాహుతి, కళశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచన పూజాధికాలు నిర్వహించారు..

Read Also: CM KCR : కాసేపట్లో ప్రగతి భవన్‌కి ముగ్గురు సీఎంలు.. కేసీఆర్‌తో బ్రేక్‌ఫాస్ట్‌

ఇక, సంక్రాంతి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలం క్షేత్రానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది.. శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని నిన్న లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠ నిఘా మధ్య ఆలయ సిబ్బంది, శివసేవకులు ఉభయ దేవాలయాలు, పరివార దేవతాలయాల హుండీల్లో వ‌చ్చిన బ‌హుమ‌తులు, న‌గ‌దును లెక్కించి.. ఆ తర్వాత వివరాలను ప్రకటించారు.. గత 28 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ. 3,57,81,068 వచ్చినట్టు శ్రీశైలం ఆలయ ఈవో లవన్న వెల్లడించారు.. ఇక, 103 గ్రాముల బంగారం, 7.520 కిలోల వెండి ఆభరణాలు, 243 అమెరికా డాలర్లు, 220 యూఏఈ ధీర్హమ్‌లు, 61 సింగపూర్‌ డాలర్లు, 175 ఆస్ట్రేలియా డాలర్లు, 20 కెనడా డాలర్లు, 150 యూరోలు, 25 ఇంగ్లాండ్‌ పౌండ్లు త‌దిత‌ర విదేశీ క‌రెన్సీ సైతం భక్తులు మొక్కుల రూపంలో స్వామి అమ్మవార్లకు హుండీలో సమర్పించారిన పేర్కొన్నారు ఈవో లవన్న.. కాగా, శివరాత్రి సమయంతో పాటు సంక్రాంతి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. మొత్తంగా ఈ నెల 12వ తేదీన శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.. ఇవాళ్టితో ముగియనున్నాయి.. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులుపాటు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు ప్రతిరోజు విశేష పూజలు అందుకున్నారు.. యాగశాల ప్రవేశం, వేదస్వస్థి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవచనం, చండీశ్వరపూజ, వాస్తుహోమం, మండపారాధనలు, రుద్రకళశ స్థాపన, వేదపారాయణాలతో పాటు ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు..