Site icon NTV Telugu

Sankranthi Rush: సంక్రాంతికి రైళ్ళు, బస్సులు ఫుల్.. పండుగకు బాదుడేనా?

Trains

E4d1bf3f 93cd 4efb 9790 Bbb5bb9e67c3

కోడిపందాలు, పిండివంటలు.. బంధువుల సందడి.. ఇంటిలో కోలాహలం.. ఇవన్నీ మిగతా పండుగల కంటే సంక్రాంతికి ఎక్కువగా వుంటుంది. హైదరాబాద్ నగరం నుంచి లక్షలాదిమంది పల్లెబాట పడతారు.. సంక్రాంతికి సొంతూరుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారికి నిరాశే ఎదురవుతోంది. 120 రోజుల ముందే రైళ్లలో సీట్లు పూర్తయిపోయాయి. ఎక్కడా ఒక్క సీటు కూడా లభ్యం కావడం లేదు. పండుగకు సరిగ్గా నెలరోజుల సమయం ఉన్నప్పటికీ వివిధ మార్గాల్లో నడిచే రైళ్లలో బెర్తులు అప్పుడే ఫుల్‌ అయిపోయాయి. ఇంకా చెప్పాలంటే అక్టోబర్ నెలలోనే REGRET అని లిస్ట్ వచ్చేసింది. వెయిటింగ్ లిస్ట్ కూడా లేదు.

Read Also: Jagdeep Dhankhar: ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దు.. ఈడీ రైడ్స్‌పై హితవు

సంకాంత్రికి నగరం నుంచి సొంతూరుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారు ఏం చేయాలో పాలుపోవడం లేదు. త్రీటైర్‌, టూ టైర్‌ మొదలుకుని స్లీపర్‌, సెకండ్‌ సీటింగ్‌ వరకు అన్నింటిలో భారీ వెయిటింగ్‌ లిస్టు కనిపిస్తోంది. దీంతో భార్య,పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామాలకు ఎలా వెళ్లాలో తెలియక చాలామంది ఆందోళన చెందుతున్నారు. దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్‌ డివిజన్ల పరిధిలోని రోజుకు 278 రైళ్లు రాకపోకలు తిరుగుతుంటాయి.

వీటిలో సింహభాగం సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి వెళుతుంటాయి. ఇక్కడినుంచే 128 రైళ్లు నడుస్తుంటాయి. ఆయా రైళ్లలో ప్రతి రోజు 4.5 లక్షల మంది ప్రయాణిస్తుంటారని రైల్వే వర్గాలు వెల్లడిస్తున్నాయి. పండుగలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెండింతలవుతుంది. సంక్రాంతికి ముందురోజులయితే సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి నుంచి లక్షలాదిమంది సొంతూళ్ళకు వెళుతుంటారు. సంక్రాంతికి వారం ముందే స్వంతూళ్ళకు వెళ్ళి పండుగ ముగిసిన రెండు రోజుల తర్వాత తిరిగి నగరానికి చేరుకుంటారు. సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో 250కి పైగా వెయిటింగ్‌ లిస్టు చూపిస్తుండడంతో సొంతూళ్లకు వెళ్లే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బస్సుల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. నగరం నుంచి ఏపీకి వెళ్లే బస్సుల్లోనూ సీట్లు దొరకడం లేదు. APSRTC, TSRTC బస్సుల్లోనే అదే పరిస్థితి కనిపిస్తోంది.

Read Also:Nirmala Sitharaman: గత మూడేళ్లలో రూ.6 లక్షల కోట్ల రుణాలు రద్దు

సాధారణంగా గ్రేటర్‌ నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, తదితర ప్రాంతాలకు ప్రతిరోజు 1200 నుంచి 1300 వరకు ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు నడుస్తుంటాయి. దసరా, దీపావళి, సంక్రాంతి పండుగ రోజుల్లో 3 వేల నుంచి 4 వేల వరకు నడుస్తాయి. సాధారణ రోజుల్లో కంటే ప్రైవేట్‌ బస్సుల్లో టికెట్‌ రేట్లు అదనం. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌-విజయవాడకు నడిచే బస్సులో స్లీపర్‌ బెర్తుకు రూ.1,650 టికెట్‌ ధర ఉండగా సంక్రాంతి సమయంలో రూ.1800 నుంచి రూ.2 వేల వరకు తీసుకుంటారు. అయితే టికెట్‌ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ బుకింగ్‌లు ముందుగా ముగుస్తుండటంతో చాలామంది ప్రైవేట్‌ కార్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పటికే ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో బుకింగ్‌లు ముగిశాయి. స్వంతంగా కార్లలో వెళ్లాలనుకునేవారికి కూడా నిరాశే ఎదురవుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ దొరకడంలేదు. దీంతో పండుగకు ఎలా వెళ్ళాలో అర్థం కావడం లేదంటున్నారు ఏపీ తెలంగాణ వాసులు.

Exit mobile version