ఉక్రెయిన్ సంక్షోభంపై రాష్ట్రంలో అత్యవసరంగా ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని ఏపీ సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తదితర ఉన్నతాధికారులు ఈ కంట్రోల్ రూమ్ బాధ్యతలు వహిస్తారని ఆయన తెలిపారు. 1902 నెంబర్ ద్వారా తల్లిదండ్రులు వారి పిల్లలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. పోలాండ్, ఉక్రెయిన్ సరిహద్దుకు చేర్చి అక్కడి నుంచి భారత్ కు విద్యార్థులను తరలిస్తారని, అలాగే మరో సరిహద్దు నుంచి కూడా విద్యార్థులను తరలించేందుకు విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ముందు అక్కడి వారిని ఉక్రెయిన్ సరిహద్దు దాటించి విమానాల ద్వారా ఢిల్లీకి అక్కడి నుంచి ఏపీకి తరలిస్తామని ఆయన వెల్లడించారు. ఏపీ, తెలంగాణ నుంచి 1000 మంది విద్యార్థులు ఉంటారు.. ఇప్పటికే కాల్ సెంటర్లకు 130 కి పైగా కాల్స్ వచ్చాయని ఆయన తెలిపారు.
తల్లిదండ్రులు అక్కడ ఉన్న విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని కంట్రోల్ రూమ్ అధికారులకు అందించాలని కోరుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఉక్రెయిన్ రాయబారి గీతేష్ శర్మ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ భూ సరిహద్దులు దాటించి మన వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అక్కడ చిక్కుకున్న విద్యార్థులతో నిరంతరం మాట్లాడుతున్నామని, అందరిని సురక్షితంగా ఇక్కడికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని ఆ దేశ ఎంబసీతో పాటు భారత ఎంబసీతోనూ మాట్లాడుతున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అననారు. అందరినీ భారత్ కు తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.