NTV Telugu Site icon

కేసీఆర్‌ వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్.. దాదాగిరి ఎవరిది..?

Sajjala RamaKrishna Reddy

Sajjala RamaKrishna Reddy

తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది… కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ దాదాగిరి చేస్తుందంటూ వ్యాఖ్యానించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అయితే, ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసు అన్నారు.. ఇక, దాదాగిరి ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్న సజ్జల… కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలను సైతం తెలంగాణ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ఇక, జల విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో 30 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం.. సముద్రం పాలు చేసిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎగువ ప్రాంతంలో ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం జల జగడానికి దిగిందన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్‌ వాటా నీటిని కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కాగా, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిదే.. తెలుగు రాష్ట్రాల మధ్య కలహాలు వద్దన్న ఆయన.. అంతేకాదు మూడోపక్షం జోక్యం అవాంఛనీయం అన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్ని వివాదంపై విచారణలో భాగంగా ఈ కామెంట్లు చేశారు జస్టిస్ రమణ.