Sajjala Ramakrishna Reddy : స్థానిక పోరుపై కూటమికి సజ్జల సవాల్

  • 600 మందిపై హత్యాయత్నం కేసులంటూ సజ్జల ఆరోపణ
  • నామినేషన్లు అడ్డుకుంటున్నారని కూటమిపై విమర్శలు
  • హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్
  • అధికారులు, పోలీసులకు సజ్జల హెచ్చరిక
Sajjala

Sajjala

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పండుగ హడావిడిని ఆసరాగా చేసుకుని, కోర్టుల సెలవులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇష్టానుసారంగా దౌర్జన్యాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షం ఎక్కడా నామినేషన్ వేయకుండా హింసాకాండ సృష్టించి, దుర్మార్గంగా నామినేషన్లను అడ్డుకుని వైసీపీ పని అయిపోయిందంటూ కూటమి నేతలు సునకానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు.

ఒకే ఎఫ్‌ఐఆర్‌లో 600 మందిపై హత్యాయత్నం కేసులా?

ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనే వందలాది మంది వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని సజ్జల ఆరోపించారు. ఏకంగా 600 మందిపై ఒకే ఎఫ్‌ఐఆర్‌లో హత్యాయత్నం కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం లాగా కాకుండా పాకిస్తాన్ బోర్డర్‌లో యుద్ధం జరుగుతున్నట్లుగా భయానక వాతావరణం సృష్టించారని విమర్శించారు. నక్సల్స్ ఎన్‌కౌంటర్లలో కూడా జరగని విధంగా విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారని, ముందస్తు ప్లాన్ ప్రకారమే తమ వాళ్లను భయపెట్టేందుకే ఈ కాల్పులు జరిపారని ఆరోపించారు. ఈ మొత్తం ఘటనలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కనీసం స్పందించి విచారణ కూడా చేయకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.

అధికార దుర్వినియోగం పరాకాష్ట.. అధికారులకు హెచ్చరిక

రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాగా తెలుసని, అందుకే ఆయన ఎన్నికలకు భయపడుతున్నారని సజ్జల విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌ల అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరిందని, దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీలో దిగాలి కానీ అధికార మదంతో దాడులు చేయడం ఏంటని నిలదీశారు. ఇలాంటి విష విత్తనాలు నేడు నాటితే రేపు అవి పెద్ద చెట్లుగా మారుతాయని హెచ్చరించారు. ప్రభుత్వ దౌర్జన్యాలకు అండగా నిలుస్తున్న అధికారులు, పోలీసుల పేర్లను డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తున్నామని, భవిష్యత్తులో ఎవరినీ వదిలిపెట్టబోమని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్ని దౌర్జన్యాలు చేసినా తాము వెనక్కి తగ్గేది లేదని, ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. బలవంతంగా నామినేషన్లు ఆపితే వచ్చేది అసలైన గెలుపు కాదని, ప్రజలు ఆశీర్వదిస్తేనే నిజమైన విజయం దక్కుతుందని సజ్జల తేల్చిచెప్పారు.