Sajjala Ramakrishna Reddy About YS Jagan Mohan Reddy Birthday Celebrations: ఈనెల 21వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ వేడుకల్లో కోట్లాది మంది అభిమానులతో పాటు సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన వారంతా పాల్గొంటారని పేర్కొన్నారు. 19న రాష్ట్రవ్యాప్తంగా క్రీడాపోటీలు, 20న మొక్కలు నాటడం, 21న సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గతంలో పార్టీ కార్యకర్తలు 38 వేల యూనిట్ల రక్తదానం చేశారని, ఈసారి వైఎస్సార్‌సీపీ బ్లడ్ డొనేషన్ డాట్ కామ్ పేరిట వెబ్‌సైట్ ప్రారంభించామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తాడేపల్లిలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న రక్తదాన కార్యక్రమ పోస్టర్‌ను, ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకుంటే.. అవసరమైనప్పుడల్లా రక్తదానం చేసే అవకాశం ఉంటుందని సజ్జల స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూదన్ రెడ్డి, పద్మజ తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు.. సీఎం జగన్‌కు ఈనెల 21న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్న వారి కోసం తపాలాశాఖ ఓ సౌకర్యాన్ని అందిస్తోంది. పార్టీ నేతలు, అభిమాననులు, సాధారణ ప్రజలు సైతం ఈ సౌకర్యం ద్వారా జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయొచ్చు. ఇందుకోసం కేవలం రూ.10 చెల్లిస్తే చాలని తపాలాశాఖ అధికారులు అంటున్నారు. పోస్టాఫీసులకు వెళ్లి రూ.10 చెల్లిస్తే.. నేరుగా జగన్‌కి శుభాకాంక్షలు పంపొచ్చని వారు చెప్తున్నారు. ఇంతకీ తపాలాశాఖ ఈ శుభాకాంక్షలను సీఎంకు ఎలా అందిస్తుందో తెలుసా? ఈ-పోస్ట్ ద్వారా జనాలు పంపే శుభాకాంక్షల్ని.. జగన్‌కు నేరుగా వెళ్లేలా తపాలాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. పోస్టాఫీస్ కౌంటర్‌కు వెళ్లి రూ.10 చెల్లిస్తే.. ఈ-పోస్ట్ ద్వారా జగన్‌కు పేరు, అడ్రస్‌తో సహా శుభాకాంక్షలు పంపుతామంటున్నారు. ఈ సదుపాయం జగన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21న అందుబాటులో ఉంటుందని కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.