NTV Telugu Site icon

Road Accidents: ఏపీలో భారీగా పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. 10 నెలల్లో 5,831 మంది మృతి

Road Accidents

Road Accidents

కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో రాష్ట్రంలోనే కాదు.. దేశ్యాప్తంగా కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా తగ్గిపోయింది.. దానికి ప్రధాన కారణం, లాక్‌డౌన్‌, కర్ఫ్యూ లాంటి చర్యలతో పాటు.. కఠినమైన రూల్స్‌ కారణంగా.. ప్రజలు తక్కువ సంఖ్యలో బయటకు రావడమే.. ఇక, మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత.. క్రమంగా రోడ్డు ప్రమాదాలు.. ఆ ప్రమాదాల్లో మృత్యువాత పడేవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతూ పోతోంది.. కరోనా సమయంలో ఇంటికే పరిమితమైన ప్రజలు.. ఆ తర్వాత.. మళ్లీ టూర్లు, ట్రిప్పులకు వెళ్తున్నారు.. రోడ్లపై రద్దీ కూడా పెరిగిపోయింది.. దీంతో, ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి.

Read Also: Love Today Movie Review: లవ్ టుడే రివ్యూ (తమిళ డబ్బింగ్)

ఇక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో ఈ ఏడాది బారీగా పెరుగుదల నమోదైంది.. ఈ ఏడాదిలో 9.95 శాతం మేర రోడ్డు ప్రమాదాలు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. 2022 జనవరి నుంచి అక్టోబర్‌ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 14,314 రోడ్డు ప్రమాదాలు జరగగా.. గత పది నెలల కాలంలో జరిగిన రోడ్ ప్రమాదాల్లో ఏకంగా 5,831 మంది మృతిచెందారు.. గతేడాదితో పోలిస్తే 6.56 శాతం మేర పెరిగిపోయింది మృతుల సంఖ్య.. ఈ ఏడాది లారీలు, ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి.. తాజాగా విలీనమండలం చింతూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందిన విషయం విదితమే కాగా.. రాష్ట్రంలోని రోడ్లపై 1200కు పైగా బ్లాక్ స్పాట్లను గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.. విపక్ష నేతలు, పక్క రాష్ట్రాల మంత్రులు, స్వామీజీలు కూడా ఏపీ రోడ్లపై స్పందించిన సందర్భాలు ఉన్నాయి.