నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా మంత్రి అయ్యాక బిజీబిజీగా మారిపోయారు. ఏపీలోని వివిధ జిల్లాలు తిరుగుతూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పనిలో పనిగా ఆయా జిల్లాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. ఏపీ రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల, క్రీడా శాఖ మంత్రి ఆర్.కె.రోజా తమిళనాడులో పర్యటించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుత్తణిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో కుటుంబ సమేతంగా శనివారం స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయంలో స్వామివారికి పుష్ప కావడితో తన మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి రోజా కుటుంబ సభ్యులకు ఆలయ కార్యనిర్వహణాధికారి, రెవిన్యూ డివిజనల్ అధికారి తదితరులు ఘన స్వాగతం పలికారు. శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామికి ఆలయంలో వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు మంత్రి ఆర్.కె.రోజా సెల్వమణి దంపతులను, సోదరులు శ్రీ రాంప్రసాద్, కుమారుడు కృష్ణ కౌశిక్, ఇతర కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో ప్రజలకు అండగా ఉండి మంచి కార్యక్రమాలు చేయాలని స్వామివారిని కోరుకున్నానన్నారు. అలాగే తాను ఆరోగ్యంతో ఉండి నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనించాలని స్వామిని కోరుకున్నట్టు మంత్రి రోజా తెలిపారు.