విశాఖ ఆర్కే బీచ్ రోడ్‌లో అల్లూరి విగ్రహానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… అల్లూరి 125వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏడాది పాటు వాడవాడలా ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ రోజు అల్లూరి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నామని అన్నారు. భీమవరంలో వచ్చే నెలలో జరిగే అల్లూరి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని తెలిపారు. అల్లూరిని స్మరించుకోవడం మన అదృష్టమని.. తెలుగు వాడిగా గర్వపడుతున్నానని అన్నారు. భారత దేశం మొత్తం అల్లూరిని పరిచయం చేస్తానని పేర్కొన్నారు. లంబసింగిలో 35 కోట్లతో అల్లూరి మ్యూజియంను ఏడాదిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
Read Also: Road Accident: గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం…
అనంతరం రోజా మాట్లాడుతూ.. అల్లూరి పేరు వింటే రోమాలు నిక్క పొడుచుకుంటాయన్నారు. 27 ఏళ్ళకే అమరుడైనా 27తరాలకు ఆయన స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. అల్లూరికి మరణం లేదన్నారు ఆమె. అల్లూరి ఆశయాలకు అనుగుణంగా జగన్ పాలన ఉందని తెలిపారు. అల్లూరి పేరుతో సీఎం జిల్లా ఏర్పాటు చేశారని అన్నారు. మన్యం ప్రజల హక్కులు, ఉపాధి , విద్య కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. అల్లూరి మ్యూజియం కు 22ఎకరాల స్థలం కేటాయించామని మంత్రి పేర్కొన్నారు. స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, ఎంపీ ఎంవీవి సత్యనారాయణ, మేయర్ హరి వెంకట కుమారి పాల్గొన్నారు.