NTV Telugu Site icon

Srisailam Land Disputes: దేవాదాయ శాఖ చరిత్రలో శుభదినం.. శ్రీశైలంలో సరిహద్దు సమస్య పరిష్కారం

Kottu Satyanarayana

Kottu Satyanarayana

Srisailam Land Disputes: దేవాదాయ, ధర్మాదాయ శాఖ చరిత్రలో ఈ రోజు శుభదినంగా పేర్కొన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం దేవస్థానం సరిహద్దు సమస్యకు పరిష్కారం దొరికింది.. రెండో ప్రధాన ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని తెలిపారు. అటవీశాఖతో చాలా కాలంగా భూవివాదం కొనసాగుతోంది.. అయితే, రెవెన్యూ, ఎండోమెంట్, ఫారెస్ట్ శాఖలతో సమీక్ష నిర్వహించాం.. మూడు శాఖలు సమన్వయంతో పనిచేసి సరిహద్దులు నిర్ణయం తీసుకున్నాం.. 4,430 ఎకరాల భూమికి బౌండరీ ఫిక్స్ చేసే దిశగా ముందుకువెళ్తున్నామని.. సరిహద్దులు నిర్ణయించే విషయమై స్కెచ్ రెఢీ చేసి.. ఎంవోయూ కుదుర్చుకున్నామని తెలిపారు.

Read Also: APSRTC: టెన్త్‌ విద్యార్థులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. ఆ సమయంలో ఉచిత ప్రయాణం..

శ్రీశైలం దేవస్థానం, దేవాదాయశాఖ చరిత్రలో ఈరోజు నుంచి సువర్ణాధ్యాయం మొదలవుతోందని పేర్కొన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. సమస్య పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, అధికారులు ఎంతో సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు మంత్రి కొట్టు.. ఇక, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. చాలా కాలంగా శ్రీశైలం దేవస్థానానికి చెందిన 5300 ఎకరాల అటవీశాఖ భూములతో ఇబ్బందులున్నాయి.. ఇప్పుడు దశాబ్ధాల కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు.. ఎవరూ పరిష్కరించలేని సమస్యకు ఈ రోజు ఓ పరిష్కారం దొరికింది.. మాఢవీధుల ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యిందన్నారు. దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమస్య పరిష్కారానికి ఎంతో శ్రద్ధ తీసుకున్నారని.. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొట్టు సత్యనారాయణకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.