NTV Telugu Site icon

Kurnool Live: కర్నూలులో రాయలసీమ గర్జన లైవ్ అప్‌డేట్స్

Rayalaseema Garjana Live Updates

Rayalaseema Garjana Live Updates

మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులో నాన్ పొలిటికల్ జేఏసీ రాయలసీమ గర్జన నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అధికార పార్టీ వైసీపీ మద్దతు పలికింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

 

The liveblog has ended.
  • 05 Dec 2022 01:33 PM (IST)

    అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తున్నాం

    వైసీపీ పాలనలో ఏపీలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తున్నామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. రాయలసీమ వాసిగా రాయలసీమ ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

  • 05 Dec 2022 01:31 PM (IST)

    మూడు రాజధానులపై బాబు కుట్ర-గుమ్మనూరు జయరాం

    ఏపీ అభివృద్ధి చెందడం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇష్టం లేదని వైసీపీ నేత గుమ్మనూరు జయరాం ఆరోపించారు. మూడు రాజధానులు రాకుండా ఉండేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • 05 Dec 2022 01:23 PM (IST)

    రాజధాని అడిగే హక్కు మాకే ఉంది-బైరెడ్డి

    రాజధాని అడిగే హక్కు రాయలసీమ వాసులకు మాత్రమే ఉందని వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులది త్యాగం అయితే శ్రీశైలం డ్యామ్‌ కోసం వేల ఎకరాలను ఇచ్చిన సీమ వాసులది ఏ తాగ్యమో చెప్పాలన్నారు. రాయలసీమకు ద్రోహం చేసింది చంద్రబాబు అని.. ఎయిమ్స్ అనంతపురంలో నిర్మించకుండా మంగళగిరి తరలించింది చంద్రబాబేనని ఆరోపించారు. అమరావతిలో రాజధాని పెట్టి రాయలసీమ గొంతు కోసింది చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు రాయలసీమలో ఆ మూడు స్థానాలు కూడా దక్కవని జోస్యం చెప్పారు. రాయలసీమ సీఎంలు ఎంత మంది అయినా ప్రజల ఆశ జగన్ పైనే ఉంటుందన్నారు.

  • 05 Dec 2022 01:21 PM (IST)

    ఉద్యమాలు చేయడానికి వెనుకాడం-కాటసాని

    కర్నూలులో జరుగుతున్న రాయలసీమ గర్జన సభలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం 80వేల ఎకరాలను సీమ వాసులు త్యాగం చేశారని.. రాజధాని కర్నూలులో ఉంటే అభివృద్ధిలో హైదరాబాద్‌ను మించిపోయేదన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం ఉద్యమాలు చేయడానికి వెనుకాడమని స్పష్టం చేశారు. రాయలసీమ గర్జన సభ ఆరంభ సూరత్వం కారాదని.. రాయలసీమ పౌరుషాన్ని చూపిస్తామని తెలిపారు.

  • 05 Dec 2022 12:38 PM (IST)

    బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి స్వల్ప అస్వస్థత

    కర్నూలులో జరుగుతున్న రాయలసీమ గర్జన సభలో బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వేదికపై కళ్ళు తిరిగి కింద కూర్చుండిపోయారు. అస్వస్థత నుంచి కోలుకున్న అనంతరం సభ మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.

  • 05 Dec 2022 12:07 PM (IST)

    వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు

    ఏపీలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్ధేశమని.. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. అటు వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు తీసుకువస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. రాయలసీమ గర్జనకు తాము మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

  • 05 Dec 2022 11:15 AM (IST)

    సీమకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి

    ఇప్పటివరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినా రాయలసీమ ప్రాంతానికి ఎవరూ చేయని పనిని సీఎం జగన్ చేశారని ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ ఓంకార్ అన్నారు. అమరావతి ఏకైక రాజధానికి తాము ఒప్పుకునేది లేదన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేవరకు అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మరోసారి తాము మోసపోయేందుకు సిద్ధంగా లేమని ఓంకార్ స్పష్టం చేశారు. సీమకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు.

  • 05 Dec 2022 11:06 AM (IST)

    కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ మద్దతు

    కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ మద్దతు ఉందని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. రాయలసీమ డిక్లరేషన్‌కు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. కేంద్రప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఏపీలో ఏ మాత్రం ఖర్చు చేశారో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. రాయలసీమ హక్కుల ఐక్య వేదిక కూడా హైకోర్టు ఏర్పాటు డిమాండ్‌తో 20 ఏళ్లుగా పనిచేస్తుందని తెలిపారు.

  • 05 Dec 2022 11:03 AM (IST)

    రాయలసీమ గర్జనకు స్వచ్ఛంద మద్దతు

    కర్నూలులోని ఎస్టీబీసీ మైదానంలో జరుగుతున్న రాయలసీమ గర్జన బహిరంగ సభ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుంది. ఈ సభకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఎన్జీవోలు, స్వర్ణకారులు, వస్త్ర వ్యాపారులు, తోపుడు బండ్లు, పాల వ్యాపారులు, ఆటోడ్రైవర్లు స్వచ్ఛంద మద్దతు ప్రకటించారు.

  • 05 Dec 2022 10:55 AM (IST)

    చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం

    రాయలసీమ గర్జన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మను జేఏసీ నేతలు దహనం చేశారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. రాజకీయ ఊసరవెల్లి చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేపట్టారు. నారాసుర భూతం అనే పేరుతో చంద్రబాబు దిష్టిబొమ్మను జేఏసీ నేతలు దహనం చేశారు.

  • 05 Dec 2022 10:46 AM (IST)

    రాయలసీమ గర్జనకు భారీగా తరలివస్తున్న ప్రజలు

    కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో రాయలసీమ గర్జన సభ జరుగుతోంది. ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి భారీగా ప్రజలు తరలివస్తున్నారు.