NTV Telugu Site icon

బాల‌య్య‌కు వైసీపీ ఎమ్మెల్యే సూటి ప్ర‌శ్న‌.. అసలు మీకు ఇష్టం ఉందా? లేదా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త జిల్లాలు కొన్ని ప్రాంతాల్లో చిచ్చు పెడుతున్నాయి.. జిల్లా పేరు కోసం కొంద‌రు.. జిల్లా కేంద్రం కోసం మ‌రొక‌రు.. గ‌తంలో ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాల‌ని ఇంకొద్ద‌రు డిమాండ్ చేస్తున్నారు.. అలాంటి జిల్లాలో ఒక‌టి అనంత‌పురం జిల్లాలో కొత్త‌గా ఏర్పాటు కాబోతున్న స‌త్య‌సాయి జిల్లా.. దీనిపై ర్యాలీ చేసి దీక్ష‌కు దిగిన హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌.. హిందూపురం కేంద్రంగానే జిల్లా ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.. అన్ని ర‌కాలుగా హిందూపురం అభివృద్ధి చెందింది.. జిల్లా కేంద్రంలో కార్యాల‌యాల ఏర్పాటుకు త‌గిన భూమి, వ‌న‌రులు పుష్క‌లంగా ఉన్నాయ‌ని ఆయ‌న చెబుతున్నారు.

Read Also: గుడ్‌న్యూస్ చెప్పిన ఎల్ఐసీ..

అయితే, నంద‌మూరి బాల‌కృష్ణ‌కు కౌంట‌ర్ ఇచ్చారు రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి.. ఎమ్మెల్యే బాల‌కృష్ణ మోసపూరిత పనులు మానుకోవాల‌ని సూచించిన ఆయ‌న‌.. హిందూపురం ప్రజలకు అనంతపురం కంటే పుట్టపర్తి చాలా దగ్గరగా ఉంటుంద‌న్నారు.. కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు ఉంటే.. తెలపమని చెప్పాం.. ఎన్టీఆర్ అంటే అందరికి అభిమానం ఉంది.. అందుకే ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేశామ‌న్నారు.. ఇక‌, ఎన్టీఆర్‌ను దూషించింది, వెన్నుపోటు పొడిచింది చంద్రబాబేన‌ని విమ‌ర్శించిన ఆయ‌న‌.. ఎన్టీఆర్ క్యాంటీన్ల ద్వారా ఎన్ని కోట్ల మందికి భోజనం పెట్టారు? అని ప్ర‌శ్నించారు.. హిందూపురంపై ప్రేమ ఉన్నట్టు ఎందుకు ప్రవర్తిస్తారు? అని బాల‌య్య‌, చంద్ర‌బాబును టార్గెట్ చేసిన ప్రకాష్ రెడ్డి.. ఇన్ని రోజులు మంచి నీరు ఇవ్వలేకపోయారు.. వైఎస్ వచ్చిన తర్వాతే నీరు వచ్చింద‌న్నారు. అంతా ఎందుకు అసలు మీకు సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయడం ఇష్టం ఉందా? లేదా..? అంటూ బాల‌య్య‌ను సూటిగా ప్ర‌శ్నించారు రాస్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. కాగా, హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే.. తాను రాజీనామా చేస్తానని.. వైసీపీ ప్రజా ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడానికి సిద్దమేనా అంటూ బాల‌కృష్ణ సవాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే.. హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాల్సిందేనని బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.