NTV Telugu Site icon

Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..

Rain

Rain

తెలుగు రాష్ట్రాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంపై ఆకాశం మేఘావృతమై ఉంది. ఓ మోస్తరు వర్షం కురవడంతో సిటీ వెదర్ ఒక్కసారిగా చల్లబడింది. దాంతో ఉక్కపోత నుంచి నగరవాసులకు ఉపశమనం లభించింది. మరోవైపు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలో ఏప్రిల్ 18 వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలోనూ మూడురోజులపాటు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాగల మూడు రోజుల వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. శని, ఆదివారాల్లో ఉరుములు లేదా మెరుపులతో వర్షాలు పడతాయని పేర్కొంది.

Read Also: COVID 19: చైనాలో కరోనా విజృంభణ.. మూతపడుతోన్న కంపెనీలు..

ఇక, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. లింగాల మండలంలో భారీ వర్షాలకు పలు గ్రామాలు జలమయమయ్యాయి. లింగాలలో ఇంటిపై ఉన్న రేకుల షెడ్డు గాలివానకు ద్వoసమైంది. బల్మూర్ మండలం తోడేళ్ళగడ్డ గ్రామంలో పిడుగుపాటుకు కాడెద్దు మృతిచెందింది. నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మండలం అహోబిలంలో భారీ వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలి వాన బీభత్సంతో భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జేసీబీ సహాయంతో చెట్లను తొలిగించి ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేశారు. అటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా బెంగళూరు నగరంలో కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఒకరు మృతి చెందారు. యెలంచెనహళ్లిలో డ్రెయిన్ నుంచి నీరు పోటెత్తడంతో పలు ఇళ్లలోకి నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.