ఏపీలో ఓ వైపు ఎండల వల్ల ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. అయితే మరోవైపు భారీ వర్షాల వల్ల ఇబ్బందులు కూడా పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో సోమవారం నాడు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని రాజాం మండలం, విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలం, తూ.గో. జిల్లాలోని ఆలమూరు మండలాల్లో ఈదురుగాలుల బీభత్సానికి చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆసనీ తుఫాన్ ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో రానున్న 5 రోజులు తేలికపాటి జల్లులు లేదా ఉరుములతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది.
