నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. రాజద్రోహం కేసుపై ఆయనను ఇటీవల ఏపీ సీఐడీ అరెస్ట్ చేయగా, తనను కొట్టారంటూ ఆయన ఆరోపించడంతో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రఘురామకృష్ణంరాజు కూతురు ఇందు ప్రియదర్శిని, కుమారుడు భరత్ బుధవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. రఘురామపై జగన్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. ఇటీవలి చోటుచేసుకున్న పరిణామాలను అమిత్‌షాకు ఇందు ప్రియదర్శిని, భరత్ వివరించారు. అనంతరం అమిత్‌షాకు ఇరువురు కలిసి వినతిపత్రం అందించారు.