President Draupadi Murmu Speech In AP Tour: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు అభినందనలు తెలిపారు. తొలుత ‘అందరికీ నమస్కారం, మీ అభిమానానికి ధన్యవాదాలు’ అని తెలుగులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన ముర్మ.. తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండే ఈ నేలపై అడుగుపెట్టడం ఆనందంగా ఉందన్నారు. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి వంటి నదులు ఈ రాష్ట్ర నేలను సారవంతం చేశాయన్నారు. నాగార్జున సాగర్, నాగార్జున కొండ, అమరావతి.. భారతదేశ చారిత్రక వారసత్వ సంపద అని తెలిపారు. కూచిపూడి నృత్యం భారత సాంస్కృతిక వైశిష్ట్యమని పేర్కొన్నారు.
దేశ భాషలందు తెలుగు లెస్సా అని వేదికపై ముర్ము అనగానే.. ఆ సభ ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో హోరెత్తింది. దేశంలోని అన్ని భాషల్లో తెలుగు శ్రేష్టమైందని కొనియాడారు. నన్నయ్య, మల్లన్న, తిక్కన నడయాడిన నేల ఇది అని.. మొల్ల రాసిన మొల్ల రామాయణానికి చరిత్రలో విశిష్ట ప్రాధాన్యత ఉందని అన్నారు. గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకం ఇప్పటికీ ఎంతో ఆదరణీయమైందన్నారు. ఈ నేలపై పుట్టిన దుర్గాబాయి దేశ్‌ముఖ్, సరోజినీ నాయుడు లాంటి మహిళలు స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఇక్కడే పుట్టి దేశానికి సేవ చేసిన డా రాధాకృష్ణ, నీలం సంజీవరెడ్డి, వీవీ గిరిలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవటం స్ఫూర్తిదాయకమన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను దేశం జరుపుకుంటోందని తెలియజేశారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన బిర్సా ముండా వంటి వారిని ఈ తరం గుర్తుంచుకోవాలని సూచించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరింత గర్వపడుతున్నారేమోనని ముర్ము చెప్పారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకన్న ఈ రాష్ట్రవాసేనని తెలిపారు. అంతరిక్షం విఙ్ఞానంలో ఇస్రోలో తెలుగువారి సేవలు దేశానికి గర్వకారణమన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని తాను కోరుకుంటున్నానని, భగవంతుడు తన ప్రార్థన తప్పక నెరవేరుస్తాడని అన్నారు. జై హింద్, జై భారత్, జై ఆంధ్రప్రదేశ్ అంటూ ద్రౌపది ముర్మ తన ప్రసంగాన్ని ముగించారు. కాగా.. ఏపీ పర్యటనకు వచ్చిన ముర్మును రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం చేసింది.