దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. అయితే జాగ్రత్తలు పాటించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. థర్డ్ వేవ్ ముగిసినట్టే భావిస్తున్నా.. రాబోయే కాలంలో మరిన్ని వేరియంట్లు ఇబ్బంది పెడతాయంటున్నారు నిపుణులు. మరోవైపు దేశవ్యాప్తంగా గర్భిణులకు కోవిడ్ వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. దేశవ్యాప్తంగా గతంలో గర్భిణులకు వ్యాక్సిన్ విషయంలో కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. డాక్టర్లు తొలుత వద్దన్నా.. తర్వాత వారికి కూడా వ్యాక్సిన్లు వేయాలని సూచించారు.
దేశంలో గర్భిణులకు వ్యాక్సినేషన్ విషయంలో మధ్యప్రదేశ్ ముందు స్థానంలో వుంది. తెలంగాణ చివరిస్థానంలో వుంది. మధ్యప్రదేశ్‌లో మొదటి డోస్ వ్యాక్సిన్ 3, 61,613 మందికి వేయగా, రెండవ డోస్ 3,22, 640 మందికి వేశారు. దేశంలో ఇవే అత్యధికంగా చెబుతున్నారు. తమిళనాడు తరవాత స్థానంలో వుంది. తమిళనాట మొదటి డోస్ వేయించుకున్నవారు 2,45,827మంది కాగా, రెండవ డోస్ వేయించుకున్న గర్భిణీలు 1,65, 331 మంది మాత్రమే వున్నారు. తెలంగాణ విషయానికి వస్తే 11, 835 మంది మాత్రమే తొలి డోస్ వేయించుకున్నారు. రెండవ డోస్ వేయించుకున్నవారు ఇంకా తక్కువగా 6,434 మంది వుండడం విశేషం.
రాష్ట్రం మొదటి డోస్ రెండవ డోస్
మధ్యప్రదేశ్ 3,61,613 3,22,640
తమిళనాడు 2,45,827 1,65,331
ఒడిశా 1,95,310 1,27,001
కర్నాటక 1,31,787 1,06,062
ఆంధ్రప్రదేశ్ 1,18,140 1,15,500
మహారాష్ట్ర 1,01,315 42,003
పశ్చిమ బెంగాల్ 87,170 56,358
గుజరాత్ 80,658 70,978
బీహార్ 51,090 21,340
ఉత్తర ప్రదేశ్ 50,746 17,081
తెలంగాణ 11,835 6,434
గర్బిణులకు ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే వ్యాక్సిన్లు వేస్తున్నారు. గర్భిణులు వ్యాక్సిన్లు డాక్టర్ల సలహా మేరకు వేయించుకోవాలని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. వ్యాక్సినేషన్ వల్ల చాలా కొద్దిమందికి మాత్రమే దుష్ప్రభావం కలిగిందని తెలుస్తోంది. జనవరి 31 నాటికి కేవలం 64 మందికి మాత్రమే ఇబ్బందులు కలిగాయి. అందులో 26 మంది మైనర్లు కాగా, మిగిలిన 38 మందికి మాత్రం సీరియస్ అయింది. అందులోనూ మహిళలకు వున్న ఇతర సమస్యల వల్ల సీరియస్ అయిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. బూస్టర్ డోస్ మనదేశంలో గర్బిణులకు ఇవ్వడం లేదు. బ్రిటన్, కొన్నదేశాల్లో మాత్రమే బూస్టర్ డోస్ వేయించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడాలంటే గర్భిణులకు త్వరితగతిన వ్యాక్సినేషన్ చేయించాల్సి వుంది.