Site icon NTV Telugu

చర్చలు విఫలం.. ఉద్యమం యథాతథం: ఏపీ ఉద్యోగుల జేఏసీ

పీఆర్సీ అమలు విషయంలో ఏపీ ప్రభుత్వం తమను తప్పుదోవ పట్టిస్తోందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈరోజు జరిగిన చర్చల్లో మూడే అంశాలు చెప్పామని, మంత్రుల కమిటీ కొంత సమయం తర్వాత అభిప్రాయం చెప్తామని తమను మభ్యపెట్టిందని… సాయంత్రానికి తమ డిమాండ్లు సాధ్యపడవు అని ఒక సందేశంలో రూపంలో పంపిందని బండి శ్రీనివాసరావు తెలిపారు. మంత్రుల కమిటీతో చర్చలు విఫలమైనందున ఈనెల 3న తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులను భయపెట్టవద్దని, ప్రభుత్వానికి వత్తాసు పలికే పనులను మానుకోవాలని కలెక్టర్లకు బండి శ్రీనివాసరావు సూచించారు.

Read Also: చిక్కీల పంపిణీలో అవినీతి ఆరోపణలు… ఖండించిన మంత్రి సురేష్

అటు చర్చల్లో పురోగతి రావాలంటే పాత జీతం ఇమ్మని ప్రభుత్వాన్ని అడిగామని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణ వెల్లడించారు. నిర్బంధపు వేతన సవరణను ఖండిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ అమలు చేయడానికి మార్చి 2022 వరకు సమయం ఉందని ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు జీవోలో పేర్కొన్నారని… అయినా రాత్రికి రాత్రి ఎందుకు జీతాలు ప్రాసెస్ చేయాలని ట్రెజరీ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారులు విశాల దృక్పథంతో ఉండాలన్నారు. ఈరోజు కొన్ని పే స్లిప్పులు చూపించారని.. అందులో తమకు జీతాలు పెరిగినట్టు చూపించి… లేనిది ఉన్నట్టుగా భ్రమింప చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారులపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.

Exit mobile version