NTV Telugu Site icon

Prathipati Pulla Rao: జగన్ ప్రభుత్వం ఏ కోర్టుకు వెళ్లినా.. ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని

Prathipati Pulla Rao

Prathipati Pulla Rao

Prathipati Pulla Rao: ఏపీ రాజధాని విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. ఈ మేరకు ఆయన గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా బుద్ధి రాదని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా.. ఏ కోర్టుకు వెళ్లినా అమరావతి ఒక్కటే రాష్ట్రానికి ఏకైక రాజధాని అని ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. రైతులు పాదయాత్ర చేస్తుంటే వాళ్ల మనోధైర్యాన్ని దెబ్బతీయటానికి వైసీపీ నేతలు కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. వైసీపీ మూడు రాజధానులకు కట్టుబడి ఉంటే అదే ఎజెండాగా ఎన్నికలకు వెళ్దామని.. రాజీనామా చేసి ఎన్నికలకు వస్తారా అని సవాల్ విసిరారు.

తనపై అవినీతి ఆరోపణలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మనిషిగా నైతిక విలువలు పోగొట్టుకున్నాడని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. బ్రహ్మనాయుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని.. దైవం మీద ప్రమాణం చేసి తనపై ఆరోపణలు చేయాలన్నారు. ఎమ్మెల్యేగా బ్రహ్మనాయుడు వినుకొండలో చేస్తున్న అవినీతిని తాను నిరూపిస్తానన్నారు. బ్రహ్మనాయుడికి ధైర్యం ఉంటే సవాల్‌ను స్వీకరించాలన్నారు.

Read Also:IT Returns Refund: మీకు ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా? కారణాలు ఇవే..!!

అటు టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా వైసీపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో మాదిరే సుప్రీంకోర్టులోనూ వైసీపీ సర్కారుకు మ‌రోమారు భంగ‌పాటు త‌ప్పదని జోస్యం చెప్పారు. చ‌ట్ట స‌భ‌ల‌ను త‌క్కువ చేసేలా హైకోర్టు తీర్పు ఇవ్వలేద‌ని ఆయ‌న అన్నారు. కేవ‌లం దురుద్దేశంతోనే ఉన్నత న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పును వ‌క్రీక‌రిస్తున్నార‌ని.. రాజ‌ధాని నిర్మాణం చేప‌ట్టకుండా ఆరు నెల‌లు ఆగి ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లడమేంటని కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు.