Site icon NTV Telugu

Andhra Pradesh: వైసీపీతో కాంగ్రెస్ పొత్తు ప్రతిపాదన.. జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా?

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహాలపై ఆయన పవర్‌ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని.. ఏపీలో మాత్రం వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు ఓ వార్త షికారు చేస్తోంది.

మరోవైపు ఏపీలో వైసీపీతో కలిసి పీకే పనిచేస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌తో పొత్తు విషయాన్ని వైసీపీ నేతల దగ్గర ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డితో పీకే చర్చలు జరిపారట. మరి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి వైసీపీ అధినేత జగన్ అంగీకరిస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలతో విభేదించి బయటకు వచ్చిన జగన్ తనకంటూ ఓ పార్టీ పెట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి జగన్ ఒప్పుకోరని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే ప్రశాంత్ కిషోర్ సూచనతో కాంగ్రెస్ పొత్తుకు సై అంటారా అనే విషయం తేలాల్సి ఉంది. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై పలువురు మంత్రులు, మాజీ మంత్రులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

వైసీపీ నాయకత్వంలో మాట్లాడకుండానే ప్రశాంత్ కిషోర్ ఈ ప్రతిపాదన చేసి ఉంటారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఓకే అన్నాకే జగన్‌తో మాట్లాడవచ్చని పీకే అనుకున్నారేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. పీకే ఏపీలో వైసీపీతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పొత్తుపై వైసీపీ నాయకత్వాన్ని ఒప్పించవచ్చని భావించి ఉంటారని కొందరు.. గత రెండు ఎన్నికల్లో రాష్ట్రంలో ఉనికే లేని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోమని పీకే ఎందుకు చెప్పి ఉంటారని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా కాంగ్రెస్‌లో చేరికపై ప్రశాంత్ కిషోర్ ఈరోజు సోనియాగాంధీతో సమావేశం ముగిసిన అనంతరం ప్రకటించే అవకాశం ఉంది.

Exit mobile version