Site icon NTV Telugu

RGV WhatsApp Message: పోలీసులకు వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టిన ఆర్జీవీ.. ఏమన్నారంటే..?

Rgv Whatsapp

Rgv Whatsapp

RGV WhatsApp Message: ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసు విచారణకు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ హాజరవుతాడా? లేదా? అనే ఉత్కంఠకు తెరపడినట్టు అయ్యింది.. తాను కేసు విచారణకు రాలేంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు రాంగోపాల్‌ వర్మ.. ఈ మేరకు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారట ఆర్జీవీ.. తాను సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో.. నాలుగు రోజులు గడువు కోరారు వర్మ.. కేసు దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానని రాంగోపాల్ వర్మ పోలీసులకు సమాచారం అందించారు. అయితే, వర్మ షూటింగ్ లో ఉన్నాడా..? లేదా..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.. కాగా, వ్యూహం సినిమా రిలీజ్ సమయంలో టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, జనసేన చీఫ్‌, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్ లపై వర్మ ఎక్స్ లో మార్ఫింగ్ ఫోటోలు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై టీడీపీ నేత ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే, మళ్లీ ఎప్పుడు రాం గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరుకావాలి అనేదానిపై మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

Read Also: AP Crime: చెల్లి పేరుతో ఎఫ్‌బీ ఖాతా తెరిచింది.. యువకుడి నుంచి కోట్లు వసూలు.. ట్విస్ట్‌ ఏంటంటే..?

అయితే, రాంగోపాల్ వర్మ తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.. ఇక, ఆర్జీవీ పిటిషన్‌పై సోమవారం రోజు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.. అరెస్ట్‌పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టం చేసింది.. మంగళవారం విచారణ హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారని పిటిషన్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. హాజరు అయ్యేందుకు మరి కొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది అభ్యర్థించారు.. ఇక, సమయం పొడిగించాలనే అభ్యర్థనను పోలీసులు ముందు చేసుకోవాలని సూచించింది హైకోర్టు.. ఇటువంటి అభ్యర్థన కోర్టు ముందు కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.. కాగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరి చేలా పోస్టులు పెట్టారని రాంగోపాల్ వర్మపై అభియోగాలున్నాయి.. ఆ అభ్యంతరకర పోస్ట్ లు వర్మ పెట్టారని టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.. ఆ కేసు విషయంలో ఆర్జీవీ హైకోర్టు మెట్లు ఎక్కగా.. హైకోర్టులో ఆర్జీవీకి చుక్కెదురైంది.. ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. పోలీసులకు వాట్సాప్ మెసేజ్‌ పెట్టారు ఆర్జీవీ..

Exit mobile version