NTV Telugu Site icon

TDP: చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌..! త్వరలో టీడీపీ గూటికి మాజీ మంత్రి..!

Sidda Raghava Rao

Sidda Raghava Rao

TDP: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీమంత్రి.. టీడీపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఎందుకో ముడిపడలేదట.. ప్రస్తుత సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును కలుద్దామన్న ప్రయత్నాలు ముందుకు సాగలేదట.. కారణం ఏదయినా ఆయనకు సీఎంను కలిసే అవకాశం రావటం.. అంది వచ్చిన అవకాశాన్ని ఆ మాజీ మంత్రి ఉపయోగించుకుని సీఎంకు తన మనసులోని మాటను విన్నవించుకోవటం జరిగిపోయాయట.. ఆయనకు కూడా ఈయన మీద అంత వ్యతిరేకత లేకపోవటంతో అంతా సానుకూలంగానే జరిగిపోయిందట.. ఇంకేంముంది ఆ సారి సొంత గూటికి చేరుకోవటానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లేనని ఆయన సన్నిహితులు చెప్పుకొస్తున్నారట..

ఆయనే ప్రకాశం జిల్లాకు చెందిన మాజీమంత్రి శిద్దా రాఘవరావు.. కొద్ది రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేశారు.. 2014లో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన శిద్దా రాఘవరావు.. 2019లో ఒంగోలు టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి అర్వాత ఆయన ఆ పార్టీ నుంచి వైసీపీలో చేరగా.. ఎన్నికల అనంతరం వైసీపీకి రాజీనామా చేశారు.. 2024 ఎన్నికల్లో దర్శి నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావించినా సాధ్యపడలేదు.. వైసీపీ అధినేత జగన్ ఉమ్మడి ప్రకాశం లోని అద్దంకి, ఒంగోలు, మార్కాపురం స్థానాలలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని సూచించినా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు.. ఇక, తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ఆరంగ్రేటం చేసిన శిద్దా రాఘవరావు 2004లో ఒంగోలు అసెంబ్లీ నుంచి తొలిసారిగా పోటీ చేసి ఓడారు.. అనంతరం టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.. 2014లో ప్రకాశం జిల్లా దర్శి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించి అప్పటి అధికార టీడీపీలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికలలో కూడా ఆయన తిరిగి దర్శి ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీ చేయాలని భావించినా అప్పటి రాజకీయ పరిస్దితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఒంగోలు పార్టమెంట్ అభ్యర్దిగా బరిలో దిగాల్సి వచ్చింది..

అయితే, ఆ ఎన్నికల్లో ఆయన అప్పటి వైసీపీ అభ్యర్ది మాగుంట శ్రీనివాసులరెడ్డిపై ఓడారు.. అనంతరం గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావటంతో కొంతకాలం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం తిరిగి వైసీపీకి రాజీనామా చేసిన శిద్దా తాను ఏ పార్టీలో చేరాలనుకుంటున్నాననే విషయం మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా ప్రకటించక పోయినప్పటికీ.. విజయవాడలో ఆయన సీఎం చంద్రబాబును కలవడం రాజకీయంగా చర్చనీయాంశంలా మారింది. తన సోదరులతో చంద్రబాబును కలిసిన శిద్దా.. వరద బాధితులకు విరాళం ఇచ్చారు. వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన చంద్రబాబును కలవాలని చూసినా అది సాధ్యపడలేదు.. టీడీపీ విజయం సాధించి అధికారం చేజిక్కించుకోవటంతో తిరిగి ఆయన టీడీపీలో చేరేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని.. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల ద్వారా ఆయనతో మాట్లాడించి.. గతంలో తనకు ఎదురైన పరిస్థితులు.. ఆర్థికంగా తాను ఎంత నష్టపోయామన్న విషయాలను తెలియచెప్పినప్పటికీ చంద్రబాబుతో ములాఖాత్ కుదరలేదట.. పార్టీ నుంచి తనకు ఎటువంటి పదవుల హామీలు లభించక పోయినా తాను మాత్రం టీడీపీలోకి తిరిగి వచ్చేందుకు సిద్దంగా ఉన్నానని శిద్దా రాయబారం నెరిపినా ఆ విషయంలో క్లారిటీ రాక పోవటంతో టీడీపీలో చేరిక కోసం ఎదురు చూస్తున్నారన్న ప్రచారం సాగింది..

శిద్దా టీడీపీలో చేరిక విషయంలో సీఎం చంద్రబాబు కొంత వరకు సానుకూలంగా ఉన్నప్పటికీ.. నారా లోకేష్ మాత్రం ఆయన రాకకు సుముఖత వ్యక్తం చేయ లేదని టాక్.. సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ లు ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే శిద్దా టీడీపీ చేరికకు లైన్ క్లియర్ అవుతుందని పార్టీ లోని సీనియర్ నేతలు కూడా శిద్దా తేల్చి చెప్పారట.. దీంతో ఆయన చేసేదేమీ లేక అవకాశం కోసం చూస్తూ ఉండి పోయారట.. సరిగ్గా ఇదే తరుణంలో విజయవాడ వరదలకు సాయం అందించాలన్న సీఎం చంద్రబాబు పిలుపు మేరకు 50 లక్షల రూపాయలు విరాళం అందించేందుకు సీఎం వద్దకు వెళ్లారు శిద్దా.. ఆయన సోదరులు శిద్దా హనుమంతరావు, శిద్దా సూర్య ప్రకాష్‌రావులతో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో కలసి వెళ్లి విరాళం చెక్కును సీఎం చంద్రబాబుకు అందచేశారు. ఈ తరుణంలో శిద్దా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారట చంద్రబాబు.. అన్నీ విషయాలు తనకు తెలుసని.. త్వరలో ఓ సారి మాట్లాడుదామని శిద్దాతో చెప్పారట చంద్రబాబు.. దీంతో విషయం కాస్తా ఆయన సన్నిహితులకు తెలియటంతో మా సారు ఇంక టీడీపీలో చేరిపోవటం ఖయమైనట్లేనని చెప్పుకుంటున్నారట.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మా సారు త్వరలోనే తిరిగి సొంత గూటికి చేరిపోతారని అడిగిన వారికి.. అడగని వారికి కూడా చెప్పుకొస్తున్నారని ప్రచారం సాగుతోంది.