ఏపీలో ప్రస్తుతం ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు. కడప జిల్లా బద్వేల్లో జరుగాల్సిన ఉప ఎన్నిక సైతం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ ఎన్నికకు మరో ఆరునెలల సమయం పట్టొచ్చు. ఇక జగన్ సర్కారు మరో రెండున్నరేళ్లపాటు ఎలాంటి ఢోకా లేకుండా అధికారంలో ఉండనుంది. అయినప్పటికీ ఏపీలో పోలిటికల్ హీట్ మాత్రం కొనసాగుతూనే ఉండటం గమనార్హం. తాజాగా ఏపీ మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులతో ఓ అరగంటసేపు భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మంత్రులకు పలు కీలక సూచనలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. గడిచిన రెండున్నరేళ్లలో సంక్షేమం కోసం వేలకోట్ల రూపాయాలను ఖర్చు చేశారు. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలతో లబ్ధి పొందుతోంది. దీంతో జగన్ రెండున్నేళ్ల పాలనపై పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు. దీనికితోడు ప్రతిపక్ష టీడీపీ ఏమాత్రం పుంజుకోవడం లేదు. దీంతో రాబోయే ఎన్నికల్లోనూ వైసీపీనే అధికారంలోకి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వేవ్ ను ఇలానే కొనసాగించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వ్యూహాకర్తగా ప్రశాంత్ కిషోర్(పీకే) పని చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ కు పీకే టీం సలహాలు, ఎన్నికల వ్యూహాలు తోడవడంతో గత ఎన్నికల వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆయన ఇతర రాష్ట్రాల్లో కొన్ని పార్టీలకు వ్యూహకర్తగా పని చేశారు. తాజాగా పీకే టీం జగన్మోహన్ రెడ్డికి కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వారి సలహా మేరకు సీఎం జగన్ తోపాటు మంత్రులందరూ ఇప్పటి నుంచే ఎన్నికల మూడ్ లోకి వెళ్లాలని సూచించారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచే పీకే టీం ఏపీలో ఎన్నికల వ్యూహాలతో రంగంలోకి దిగుతుందని మంత్రుల దగ్గర ఆయన ప్రస్తావించినట్లు టాక్ విన్పిస్తోంది.
జగన్ సర్కారుపై గడిచిన రెండేన్నళ్లలో ఎలాంటి రిమార్క్ లేదని దీనిని ఇలా కంటిన్యూ చేయాలని ప్రశాంత్ కిషోర్ సూచించారట. ప్రతిపక్షాలకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని సీఎం జగన్ కు చెప్పినట్లు తెలుస్తోంది. విపక్ష పార్టీలు ప్రభుత్వంపై విరుచుకుపడితే అంతే ధీటుగా తిప్పికొట్టాలని సూచించారట. ఈమేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా నిర్వహించిన క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులందరికీ మార్గనిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం జగన్ మరోసారి పీకేను రంగంలోకి దింపనున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ గతంలో మాదిరిగానే సూపర్ హిట్ అవుతుందో లేదో వేచిచూడాల్సిందే..!