NTV Telugu Site icon

Human Heart: ఆమె కన్నుమూసింది.. కుటుంబ సభ్యుల నిర్ణయంతో ముగ్గురికి పునర్జన్మనిచ్చింది..

Human Heart

Human Heart

ఆమె చనిపోయింది.. కానీ అమె హృదయం శ్వాసిస్తూనే ఉంది. అమె చనిపోయింది. కానీ అమె మూత్రపిండాలు రక్తాన్ని శుధ్ది చేస్తూనే ఉన్నాయి. అమె కళ్ళు ప్రపంచాన్ని చూస్తూనే ఉన్నాయి..అమె చనిపోయినా ముగ్గురి జీవితాల్లో బ్రతికే ఉన్నారు. కళ్లు తెరిస్తే జననం. కళ్లుమూస్తే మరణం. ఆ రెండింటి మధ్య ఉన్న సమయమే జీవితం. ఎన్నాళ్లు బ్రతికామన్నది కాదు. ఎలా బ్రతికామన్నదే ముఖ్యం. తాము చనిపోతూ అనేకమంది జీవితాల్లో బతికే ఉంటున్నారు. కొందరు అలా ముగ్గురికి పునర్జన్మ అందించారు విశాఖపట్నంకు చెందిన సన్యాసమ్మ..

Read Also: Fake Lawyers: న్యాయవ్యవస్థలో నకిలీలు.. ఫేక్‌ సర్టిఫికెట్లతో న్యాయవాదులుగా చలామణి

తిరుపతిలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్‌ సెంటర్‌ హాస్పిటల్‌లో అరుదైన గుండె మార్పిడి ఆపరేషన్‌ శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. దాత గుండెను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి అమర్చారు. అవయవాన్ని తరలించేటప్పుడు మార్గమధ్యలో ఎటువంటి అంతరాయమూ కలగకుండా పోలీసులు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లా చిట్వేల్‌కు చెందిన 15 ఏళ్ల బాలుడు విశ్వేశ్వరకు చిన్నతనం నుంచే గుండె సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల అది తీవ్రతరం కావడంతో తిరుపతిలోని పలు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. స్విమ్స్‌ వైద్యుల సలహా మేరకు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు బాలుడిని పరిశీలించి గుండె మార్పిడి తప్పనిసరని నిర్ధారించారు. దాత కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాకు చెందిన బీహెచ్‌ఈఎల్‌ ఉద్యోగి ఆనందరావు తన భార్య 51ఏళ్ల సన్యాసమ్మతో కలిసి సంక్రాంతి పండగకు సొంత ఊరు వెళ్లారు. ఈ నెల 16న విశాఖ తిరిగి వస్తుండగా ఎయిర్‌ పోర్టు సమీపంలో బైకు పైనుంచి సన్యాసమ్మ జారిపడిపోవడంతో ఆమె బ్రెయిన్‌ డెడ్‌ అయింది. చికిత్స కోసం షీలానగర్‌ కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో వైద్యులు ఇందుకు ఏర్పాట్లు చేశారు. షీలానగర్‌లోని కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రి నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా గుండెను తరలించారు.

శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి ఆమె గుండెను అమర్చేందుకు విశాఖ నుంచి రేణిగుంటకు ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. అక్కడి నుంచి గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి 25 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 22 నిమిషాల్లో చేరుకునేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఉదయం 11.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయాన్ని చేరుకున్న సన్యాసమ్మ గుండెను 11.52 గంటలకు తిరుపతి పద్మావతి చిల్డ్రన్స్‌ గుండె ఆస్పత్రికి చేర్చారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వైద్యులు ఆ గుండెను బాలుడికి అమర్చారు. దీంతో, అవయవదానానికి అంగీకరించిన వారికి, శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులకు, ట్రాఫిక్‌ను నియంత్రించి సహకరించిన పోలీసులకు బాలుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సన్యాసమ్మ తాను చనిపోతూ గుండె దానం ద్వారా బాలుడి ప్రాణం నిలిపింది. సన్యాసమ్మ కిడ్నీలను చెన్నైకు, కళ్లను విశాఖలోనే మరొకరి కోసం తరలించారు. సన్యాసమ్మ కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం… విధిని సైతం వెక్కరించింది. భౌతికంగా అమె చనిపోయినా.. అమె హృదయ స్పందనలు మాత్రం ఆ బాలుడులో ఎప్పటికీ బ్రతికే ఉండాలని భావించి.. అమె కళ్ళు, గుండె, కిడ్నీలను దానం చేశారు. సన్యాసమ్మ దేహం చితిలో కాలిపోయినా. ఆమె హృదయం శ్వాసిస్తూనే ఉంది. మూత్రపిండాలు రక్తాన్ని శుద్దిచేస్తూనే ఉన్నాయి.కళ్ళు ప్రపంచాన్ని చూస్తునే ఉన్నాయాని జోహార్ సన్యాసమ్మ. జోహార్ అంటూ ఆమెకు, వారి కుటుంబ సభ్యలైన సన్యాసమ్మ భర్త ఆనందరావు, కుమారులు చైతన్య, జయప్రకాన్లను పలువురు అభినందించారు. 2021 అక్టోబర్ 11న సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ ఇప్పటి వరకు వెయ్యి మంది చిన్నారులకు పునర్జన్మ ప్రసాదించింది. ఈ క్రమంలోనే ఇక్కడి వైద్యులు శుక్రవారం మరో అరుదైన హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్‌‌కు విజయవంతంగా నిర్వహించారు. మరోవైపు సన్యాసమ్మ తమ ఎదుట లేకపోయినా అవయవదానం రూపంలో ఆమె బ్రతికే ఉంటుందని కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.