Clashes in Macherla: పల్నాడు జిల్లా మాచర్ల అగ్నిగుండంలా మండిపోతోంది. వైసీపీ కార్యకర్తల విధ్వంసంతో మాచర్లలో హింస పేట్రేగింది. అధికార పార్టీ కార్యకర్తలను కంట్రోల్‌లో పెట్టాల్సిన పోలీసులు కూడా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై ప్రతాపం చూపుతున్నారు. ఇప్పటికే 144 సెక్షన్ విధించిన పోలీసులు టీడీపీ నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. మరోవైపు గుంటూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుతో పాటు టీడీపీ నేతలు నజీర్ అహ్మద్, కనపర్తి శ్రీనివాస్ ఇళ్లకు తెల్లవారుజామునే పోలీసులు చేరుకున్నారు. టీడీపీ నేతలు పల్నాడు వెళ్తారనే సమాచారంతో వారిని బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. కాగా ప్రస్తుతం మాచర్లలో పరిస్థితి అదుపులోనే ఉందని జిల్లా ఎస్పీ వెల్లడించారు.
Read Also: RBI Shock: రేజర్‌పే, క్యాష్‌ఫ్రీకి RBI షాక్.. తాత్కాలిక ఆంక్షలు
అటు శుక్రవారం నాడు టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరుల ఇళ్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన అపార్టుమెంట్‌లోని 8 కార్లను ధ్వంసం చేశారు. వీటిలో మూడు కార్లు టీడీపీ నేతలవి కాగా మిగిలిన నాలుగు అపార్టుమెంట్ వాసులకు చెందిన కార్లు అని తెలుస్తోంది. అంతేకాకుండా రెండు ప్లాట్లలోకి వైసీపీ నేతలు జొరబడి ధ్వంసం చేశారు. లోపలుండి ఇళ్లకు తాళాలేసినా పగులకొట్టి ఫ్లాట్లల్లోకి వైసీపీ కార్యకర్తలు ప్రవేశించి ఐరన్ డోర్లని విరగొట్టి లోపలకొచ్చి ధ్వంసం చేశారు. తమ ఇంట్లో జొరబడి రూ. లక్ష నగదు, 15 తులాల బంగారం దోచుకెళ్లారని టీడీపీ కార్యకర్త భార్య ఆరోపించారు. కాగా గొట్టిపాల, వెల్దుర్తి గ్రామాల నుంచి కొన్నేళ్ల క్రితమే బాధితులు మాచర్లకు వచ్చారు. ఈ నేపథ్యంలో మధు అనే కార్యకర్త భార్యపై రాడ్లతో దాడి జరిగింది. శనివారం ఉదయం వరకు ఫ్లాట్ల వద్దకు రాని పోలీసులు తీరిగ్గా కాసేపటి క్రితమే వివరాల సేకరణకు వచ్చారు. అయితే తాము ఫిర్యాదు చేసినా లాభం ఏముంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.