Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం మెగా ప్లాన్..

  • 2027 జూన్ నాటికి పూర్తి లక్ష్యం
  • కేంద్రం నుంచి రూ.3,300 కోట్ల అదనపు నిధులు
  • న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
  • పునరావాసం, నిర్మాణ పనులకు వేగం
Polavaram

Polavaram

Polavaram Project : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వరప్రదాయిని, జీవనాడి అయిన పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రాజెక్టు నిర్మాణ గడువును 2027 జూన్ నాటికి ఖరారు చేయడంతో పాటు, నిధుల కొరత లేకుండా భారీ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర జలశక్తి శాఖ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే రూ.2,300 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, తాజాగా మరో రూ.3,300 కోట్ల అదనపు నిధుల మంజూరుకు అంగీకరించింది.

ఈ నిధులను వచ్చే సెప్టెంబర్ నాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనివల్ల ప్రాజెక్టు పనులతో పాటు పునరావాస కార్యక్రమాలు వేగవంతం కానున్నాయి.ప్రాజెక్టు పురోగతిపై శుక్రవారం న్యూఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌, జల వనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు , ఇతర ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలు , ముంపు ప్రభావంపై సుదీర్ఘంగా చర్చించారు.

పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో, 194.6 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించేలా తదుపరి కార్యాచరణను కార్యదర్శి కాంతారావు నిర్దేశించారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు రెండో దశ భూసేకరణ , పునరావాస (R&R) ప్యాకేజీ అమలుపై కూడా అధికారులు ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేశారు. ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు స్వయంగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతాలు , ముంపు గ్రామాల్లో పర్యటించారు. పనుల వేగాన్ని, బాధితులకు అందుతున్న పునరావాస సేవలను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ మద్దతుతో, దశాబ్దాల నాటి ఆంధ్రుల కల 2027 జూన్ నాటికి సాకారం కానుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.