NTV Telugu Site icon

PM Narendra Modi Vizag Tour: విశాఖ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ..

Pm Narendra Modi

Pm Narendra Modi

మరోసారి ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు సిద్ధం అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ.. వచ్చే నెలలో ఆయన విశాఖలో పర్యటించనున్నారు.. నవంబర్‌ 11వ తేదీన విశాఖ‌ రానున్న ఆయన.. రూ.400 కోట్లతో విశాఖలో చేపట్టనున్న రైల్వే న‌వీక‌ర‌ణ ప‌నులకు శ్రీకారం చుట్టనున్నారు.. రైల్వే న‌వీక‌ర‌ణ ప‌నులతో పాటు.. ప‌లు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు భారత ప్రధాని… ఈ అధికారిక కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం… ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కూడా పాల్గొననున్నారు.. మరోవైపు.. ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. పార్టీ కార్యక్రమానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు.. అయితే, ప్రధాని మోడీ విశాఖ పర్యటన ఆసక్తికంగా మారింది..

Read Also: Astrology : అక్టోబర్‌ 26, బుధవారం దినఫలాలు

విశాఖ కేంద్రంగా ఇప్పటికే రాజకీయం రసవత్తరంగా సాగుతోంది… ఓవైపు మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతోంది.. విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని ఏర్పాటు చేసి తీరుతాం అంటోంది.. మరోవైపు.. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.. అమరావతి ప్రాంత రైతులు పాదయాత్ర కూడా చేస్తున్నారు.. ఇప్పటికే అమరావతి రాజధానికే తమ సపోర్ట్‌ అని బీజేపీ స్పష్టం చేయగా.. ప్రధాని విశాఖ పర్యటన ఆసక్తికంగా మారిపోయింది.. ఇక, తన పరట్యనలో ఏపీ బీజేపీ నేతలతోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు మోడీ… ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్ తో పాటుగా గవర్నర్ బిశ్వభూషణ్ ప్రధాని పర్యటనలో పాల్గొనున్నారు. మరోవైపు.. ఏపీ ప్రభుత్వం అదే రోజున ప్రధాని మోడీతో భోగాపురం విమానాశ్రయం, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయించే విధంగా పీఎంవోకు ప్రతిపాదనలు పంపింది… ఈ రెండు కార్యక్రమాలకు ప్రధాని హాజరయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.. విశాఖ రైల్వే జోన్‌పై రకరకాల పుకార్లు సాగుతున్నాయి.. విశాఖ రైల్వే జోన్ వచ్చే అవకాశం లేదని కొందరు అంటుంటే.. అదే జరగకపోతే.. రాజీనామాకు సిద్ధంమని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రకటించారు..

అయితే, తన పర్యటనలో ప్రధాని మోడీ.. వివాఖ రైల్వే జోన్‌పై క్లారిటీ ఇస్తారనే అంచనాలున్నాయి.. దీంతో పాటుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి సంబంధించి నిధుల కేటాయింపు పైనా ప్రకటన ఉంటుందని అంచనా వేస్తున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన.. ఆ వెంటనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పర్యటనతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం.. మంత్రుల కాన్వాయ్‌లపై రాళ్ల దాడి చేసినట్టు ఆరోపణలు రావడం.. జనసేన నేతలపై కేసులు పెట్టడం లాంటి చర్యలతో విశాఖలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. ఇక, ప్రధాని పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం. కాగా, జులైలోనే ఏపీలో పర్యటించారు ప్రధాని మోడీ.. జులై 4వ తేదీని ఏపీకి వచ్చిన ఆయన.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. తెలుగులో ప్రసంగించి అందర్నీ ఆకట్టుకున్నారు. తెలుగువీరలేవరా.. దీక్ష బూని సాగరా..! అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

Show comments