మహా శివరాత్రికి శైవక్షేత్రాలు భక్తజనసంద్రంగా మారాయి. శివనామస్మరణతో , ఓంకార నాదంతో ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది మారుమోగుతోంది. మహానంది క్షేత్రంలో అంగుళం స్థలం ఖాళీ లేకుండా జన సంద్రమైంది. ఆధ్యాత్మిక ,. సాంస్కృతిక కార్యక్రమాలు హంగామాతో తన్మయం చెందారు లక్షలాదిమంది భక్తులు. అర్ధరాత్రి దాటాక కమనీయంగా, కన్నుల పండుగగా మహానందీశ్వర స్వామి, కామేశ్వరి దేవి అమ్మవారి కళ్యాణోత్సవం జరిగింది. మహానందీశ్వరుని సన్నిధిలో శివరాత్రి జాగరణ చెయ్యడానికి విచ్చేశారు వేలాది మంది భక్తులు. శివనామ స్మరణ చేస్తూ ఓంకారం పలుకుతూ క్యూ లైన్ లో నిరీక్షణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చాడు మహానందీశ్వర స్వామి.
జాగరణ కోసం పోటెత్తారు జనం. వీరికి అన్నదానాన్ని అల్పాహారాన్ని అందించాయి పలు కుల , ప్రజా సంఘాలు. చెక్కభజన ,కోలాటం,తప్పెట్ల్లు ,కేరళ సింగారి మేళం తెల్లవారే వరకు హోరెత్తించాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను విశేషంగా ఆదరించారు భక్తులు. ఆలయం ప్రాంగణంలోని విద్యుత్ దీపాల అలంకరణ కైలాసాన్ని మరిపించింది. మహానంది క్షేత్రంలో మహానందీశ్వర స్వామి కామేశ్వరి దేవి అమ్మవారు కళ్యాణాన్ని కమనీయంగా పనుల పండుగగా నిర్వహించారు వేద పండితులు. శతాబ్దాలుగా వస్తున్న ఆచారం ప్రకారం పెళ్లి పెద్దలుగా ఉంటూ కళ్యాణాన్ని జరిపించారు బ్రహ్మనందీశ్వర స్వామి, పార్వతీదేవి అమ్మవార్లు.
చిన్న తిరుపతిలో మహా సుదర్శన యజ్ఞం
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐ ఎస్ జగన్నాధపురంలో సుందరగిరిపై స్వయంభువుగా కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జ్వాలా సంపుటిత మహా సుదర్శన యజ్ఞం కన్నుల పండువుగా జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా లోక శాంతి కోసం యజ్ఞాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. 17 వేల రుద్రనామాలతో రుద్రహోమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు.
యజ్ఞంలో 1331 కలశాలను ఉంచి సహస్ర కలషాభిషేకం చేశారు. శాలిగ్రామ అభిషేకాలు నిర్వహించారు. యజ్ఞకుండంలో ఔషధ పదార్థాలు, లోహాలు మరియు పలు రకాల పూజ ద్రవ్యాలను వేశారు. హైదరాబాద్ కి చెందిన నరసింహ గురూజీ గత 29 సంవత్సరాలుగా ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన జ్వాలా సంపుటిత మహా సుదర్శన యజ్ఞాన్ని నిర్వహించడం ఇక్కడ ఆనవాయితి… యజ్ఞాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ముందుగా స్వామిని దర్శించి, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన యల్ఈడి స్క్రీన్ లపై యజ్ఞాన్ని తిలకించారు. యజ్ఞంలో సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు పాల్గొన్నారు.