Perni Nani Responds To Pawan Kalyan Comments: ‘‘తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతా’’నన్న జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో అగ్గిరాజేశాయి. పవన్ ఆ వ్యాఖ్యలు చేయడమే ఆలస్యం.. వెంటనే వైసీపీ నేతలు రంగంలోకి దిగి, ఎదురుదాడులు చేయడం మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఏపీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి, అంబటి రాంబాబు, జోగి రమేష్ సహా పలువురు ఎమ్మెల్యేలు ఖండిస్తూ.. పవన్ ముమ్మాటికీ ప్యాకేజీ స్టారేనని విరుచుకుపడ్డారు. ఇప్పుడు తాజాగా ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని సైతం పవన్‌పై ధ్వజమెత్తారు. పవన్ చేసిన తాజా వ్యాఖ్యలతో దత్తపుత్రుడి ముసుగు తొలగిందని.. ఆ ముసుగు వెనుక ఉన్నది చంద్రబాబేనని తేలిపోయిందని అన్నారు. చంద్రబాబుకు లబ్ధి కలిగించడమే పవన్ అంతిమ లక్ష్యమని అన్నారు. ‘సన్నాసి నాలుక చీరేస్తా అని నేను అనలేనా? కానీ.. నాకు సంస్కారం అడ్డు వస్తోంది’ అని చెప్పారు.
ఇన్నాళ్లూ దత్తపుత్రుడిగా కొనసాగుతున్న పవన్.. ఇప్పుడు సన్నాసిన్నర సన్నాసిగా కూడా మారిపోయారని పేర్ని నాని సెటైర్లు వేశారు. తన పార్టీకి కాకుండా మరో పార్టీకి ఓటు వేయమని చెప్పే నేతను ప్యాకేజీ స్టార్ అనకుండా ఇంకేమంటారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను పట్టుకుని నా కొడకల్లారా అనేంత బలుపు పవన్‌కు ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీశారు. తాను ఇంతవరకు పవన్ కల్యాణ్‌ను ప్యాకేజీ స్టార్ అనలేదని, తమ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే ఆ మాట అన్నారన్నారు. ఒకవేళ 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులను నిలిపితే… పవన్‌ను ప్యాకేజీ స్టార్ అన్న అందరి తరఫున తానే క్షమాపణ చెప్తానని సవాల్ విసిరారు. ఈరోజు నుంచి రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారుతుందని పవన్ ప్రకటించారంటే.. జనసేన తిరిగి టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లేనని, బీజేపీకి గుడ్‌బై చెప్పేసినట్లేనని అన్నారు. చంద్రబాబుతో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే సమయం దగ్గరపడింది కాబట్టే.. పవన్ ఇలా మాట్లాడుతున్నారన్నారు.
గూండాలు ఉన్నది పవన్ కల్యాణ్ పార్టీలోనేనని, తిట్టిన నోటితోనే బీజేపీతో జట్టుకట్టారని పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు కాళ్లు పిసకను, బూట్లు నాకను అని పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్ను సోదరా అని పిలిస్తేనే అంత కడుపు రగిలితే.. నా కొడకల్లారా ఎమ్మెల్యేలను అంటే మాకు రగలదా? అని ప్రశ్నించారు. నీకు ఒక కాలికే చెప్పు ఉందేమో.. మాకు రెండు కాళ్లకు చెప్పులున్నాయని హెచ్చరించారు. చెప్పు తీసి సినిమా డైలాగులు చెప్తే.. నీ నోటి తీట తీరుతుందే తప్ప ఏమీ చేయలేవన్నారు. నీ తాటాకు చప్పుళ్లకు వైఎస్సార్‌సీపీ జడిసిపోదని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
